రేపు సంకష్టహర చతుర్థి..ఇలా పూజిస్తే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి!
- Author : Vamsi Chowdary Korata
Date : 05-01-2026 - 10:37 IST
Published By : Hashtagu Telugu Desk
Sankashti Chaturthi మనకు ఎంత కష్టం వచ్చినా.. జీవితంలో ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నా సంకటహర చతుర్థి లేదా సంకష్టి చతుర్థి రోజున విఘ్నాలు తొలగించే వినాయకుడిని నిండు మనసుతో పూజిస్తే అన్నీ సంకటాలు, విఘ్నాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున సంకటహర చతుర్థి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో సంకటహర చతుర్థి జనవరి 2026 తేదీ, విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం సంకటహర చతుర్థి అనేది ప్రతి మాసంలో వచ్చే వినాయకుడి పండుగ. పౌర్ణమి (కృష్ణ పక్షం) తర్వాత 4వ రోజు ఈ సంకష్టహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి మంగళవారం రోజు వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. అంగారక సంకటహర చతుర్థిని ఏడాదిలో వచ్చే మిగిలిన సంకటహర చతుర్థి రోజుల్లో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ సంకటహర చతుర్థి రోజున భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటించి భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు. సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ రోజున వినాయకుడిని, చంద్రుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని.. అడ్డంకులు, ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయని భక్తుల నమ్మకం. వినాయకుడు అడ్డంకులను తొలగించేవాడు.. తెలివితేటలకు, జ్ఞానానికి అధిపతి.
2026 జవనరి 6వ తేదీకి అత్యంత విశిష్టత
ఈ కొత్త ఏడాదిలో జనవరి 6వ తేదీ మంగళవారం ఎంతో విశిష్టమైన రోజు. ఎందుకంటే ఈ రోజున అన్నదమ్ములైన సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు కలిసి వస్తున్నారట. ఎలాగంటే మంగళవారానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి.. ఇక ఈ రోజున వినాయకుడికి సంబంధించిన అంగారకి సంకష్టహర చతుర్థి అత్యంత శుభప్రదమైన రోజు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, ఆటంకాలు, అప్పుల బాధలు ఎదురవుతున్నవాళ్లు ఈ రోజున వినాయకుడికి బెల్లం, గరిక, పూలు, పండ్లు, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించి సంకటహర గణేశ స్తోత్రం, గణేశ పంచ రత్నం పఠించడం ఎంతో శ్రేష్టమైనది. ఇలా చేయడం వల్ల అడ్డంకులు, ఆర్థిక కష్టాలు, అప్పుల బాధ, అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతారు.
సంకటహర చతుర్థి పూజా విధానం
ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వక్రతుండ మహాకాయ మంత్రం పఠిస్తూ సూర్యుడికి గంగా జలం సమర్పించాలి. అనంతరం ఇంటి దగ్గర్లో ఉన్న వినాయకుడి ఆలయానికి వెళ్లి గణపతి విగ్రహానికి పూజలు నిర్వహించాలి. ఇక ఇంట్లో గణపతి పూజ విషయానికొస్తే.. ఆరోజున వీలును బట్టి పూర్తిగా లేదా పాక్షికంగా ఉపవాసం ఉండొచ్చు. గణపతి విగ్రహం ప్రతిష్టించి నెయ్యి దీపాలు వెలిగించి దుర్వా గడ్డి, పూలు పండ్లు, మోదకాలు, లడ్డూలు వంటి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజున మానసిక స్వచ్ఛతను పాటించాలి. వినాయక స్తోత్రం, వినాయక శ్లోకాలు, వినాయక మంత్రాలు వంటివి పఠించాలి. ఇలా చంద్రోదయం వరకు పూజలు, వ్రతాలు పాటించాలి. చంద్రోదయం తర్వాత చంద్రుడికి పూజ చేసి ఉపవాసం విరమించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలు, నష్టాలు, అడ్డంకులు, పాపాలు నశిస్తాయని విశ్వాసం.