BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత
- Author : Vamsi Chowdary Korata
Date : 26-03-2026 - 2:17 IST
Published By : Hashtagu Telugu Desk
Srirama Navami భద్రాచలం శ్రీరామనవమి కల్యాణోత్సవం సందర్భంగా సికింద్రాబాద్కు చెందిన ఎస్.ఎస్. జయరాజు కుటుంబం పట్టు వస్త్రాలను సిద్ధం చేసింది. మూడు తరాలుగా, సుమారు వంద ఏళ్లుగా వీరి కుటుంబం ఈ సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక మగ్గం ఏర్పాటు చేసి, పోచంపల్లి శైలిలో సీతాదేవికి చీరలు, రామలక్ష్మణులకు పంచెలను నేయించారు. రూ.2 లక్షల వ్యయంతో రూపొందించిన ఈ వస్త్రాలను నేడు ఆలయ అధికారులకు అందజేయనున్నారు. ఈ వస్త్రాలతోనే స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.
జగదభిరాముడు శ్రీరామచంద్రుడు, జగన్మాత సీతమ్మ తల్లికి జరిగే కమనీయమైన కల్యాణ వేడుకకు భద్రాద్రి దివ్యక్షేత్రం ముస్తాబవుతోంది. భద్రాద్రి పురవీధులు సీతారాముల కల్యాణ శోభతో కళకళలాడుతున్నాయి. పెళ్లికొడుకుగా రామయ్య, పెళ్లి కూతురుగా సీతమ్మతల్లి ముస్తాబయ్యే గడియలు దగ్గర పడుతున్నాయి. వారిని వధూవరులుగా అలంకరించటానికి ప్రత్యేకంగా తయారు చేసిన చేనేత పట్టువస్త్రాలు సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్కు చెందిన చేనేత కుటుంబం గత వంద ఏళ్లుగా, మూడు తరాలుగా సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు తయారు చేసి అందిస్తోంది.
సికింద్రాబాద్కు చెందిన ఎస్.ఎస్. జయరాజు కుటుంబం భద్రాద్రి రామయ్యపై ఉన్న అపారమైన భక్తితో దశాబ్దాలుగా పట్టు వస్త్రాలను సమర్పిస్తోంది. జయరాజు తాతల కాలం నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. గత ఐదు ఏళ్లుగా ప్రభుత్వ అధికారిక అనుమతితో భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలను అందిస్తున్నారు. ఈ పట్టు వస్త్రాల తయారీ వెనుక ఒక ప్రత్యేకత ఉంది. వీటిని బయట నేయకుండా భద్రాచలం ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మగ్గంపై నేయిస్తారు. గత రెండు వారాలుగా జయరాజు ఆధ్వర్యంలో నిపుణులైన చేనేత కార్మికులు ఆలయ ప్రాంగణంలోనే ఉండి ‘పోచంపల్లి’ శైలిలో అద్భుతమైన వస్త్రాలను రూపొందించారు. ఆ మగ్గాన్ని ఆలయంలోనే భద్రపరిచి, ప్రతి ఏటా శ్రీరామనవమికి ముందు దానిపైనే నేత పనులు ప్రారంభిస్తారు. సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఈసారి పట్టు వస్త్రాలను సిద్ధం చేశారు.
ఈ ఏడాది కల్యాణోత్సవం కోసం సీతాదేవికి రెండు పట్టు చీరలు, శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి కోసం ఆరు జతల అంగవస్త్రాలు, పంచెలు సిద్ధం చేశారు. మొత్తంగా 4800 దారాలను ఉపయోగించి శ్రీరామచంద్ర దంపతులకు పట్టువస్త్రాలు రూపొందించారు. ఆరున్నర మీటర్ల పొడవు, మీటరున్నర వెడల్పు కలిగిన సప్తవర్ణాల చీరకు అంచులో హంసలు, ఏనుగులు, జింకలు, కొబ్బరిచెట్ల బొమ్మలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బుధవారం (మార్చి 25) నాటికి నేత పనులన్నీ పూర్తి కాగా.. నేడు ఆలయ అధికారులకు అధికారికంగా అందజేయనున్నారు. శ్రీరామనవమి రోజు అత్యంత వైభవోతంగా జరిగే సీతారాముల కల్యాణంలో స్వామివారు, అమ్మవారు జయరాజు బృందం నేసిన వస్త్రాలనే ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే సంప్రదాయబద్ధంగా రాముల వారి కల్యాణానికి పట్టువస్త్రాలు సిద్ధం చేశామని చేనేత కళాకారుడు జయరాజు తెలిపారు. తమ తాతల కాలం నుంచి ఇది ఒక ఆచారంగా వస్తోందన్నారు. తాను ఉన్నంత వరకు, ఆ తర్వాత తరం కూడా ఈ సేవను కొనసాగించాలని జయరాజు వెల్లడించారు