తెలంగాణ కంచి ‘కొడకంచి’: మహిమలు చూపిస్తున్న ఆదినారాయణ స్వామి మరియు భక్తుల కోసం క్షేత్ర విశేషాలు !
- Author : Vamsi Chowdary Korata
Date : 19-01-2026 - 12:28 IST
Published By : Hashtagu Telugu Desk
Sri Adinarayana Swamy Temple తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలో కొలువైన కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అపురూపమైన ఆధ్యాత్మిక సంపదకు నిలయం. పచ్చని పొలాల మధ్య, ఒక అందమైన చెరువు చెంతన, కొండపై వెలసిన ఈ క్షేత్రాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ‘తెలంగాణ కంచి’ అని పిలుచుకుంటారు. సుమారు 10వ శతాబ్దంలో ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ పురాతన ఆలయం, నేటికీ తన వైభవాన్ని చాటుకుంటూ భక్తులకు కైలాస మరియు వైకుంఠ అనుభూతిని ఏకకాలంలో కలిగిస్తోంది. తమిళనాడులోని సుప్రసిద్ధ కాంచీపురం వెళ్లలేని భక్తులు, కొడకంచిని దర్శించుకుంటే ఆ క్షేత్ర దర్శనంతో సమానమైన పుణ్యఫలం దక్కుతుందని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం.
ఈ ఆలయానికి ఉన్న ప్రధాన ఆకర్షణ మరియు విశిష్టత ఇక్కడి బంగారు, వెండి బల్లులు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఉన్నట్లుగానే, ఇక్కడ కూడా గోడపై ఈ బల్లుల ప్రతిమలు ఉంటాయి. సరీసృపాల వల్ల కలిగే దోషాలు (పాము, బల్లి వంటి జంతువుల వల్ల కలిగే జాతక దోషాలు) ఉన్నవారు, ఈ ప్రతిమలను తాకడం ద్వారా ఆయా దోషాల నుండి విముక్తి పొందుతారని ప్రతీతి. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. కేవలం బల్లుల ప్రతిమలే కాకుండా, ఇక్కడి శివలింగం అత్యంత మహిమాన్వితమైన బ్రహ్మ సూత్రం శివలింగం దర్శిస్తే మీ అదృష్టం పండినట్లే.. ఈ లింగం నీటిలో కొట్టుకువచ్చిందని, ఇది కోటి శివలింగాలతో సమానం అని భక్తులు విశ్వసిస్తారు.

Sri Adinarayana Swamy Temple
క్షేత్ర పురాణం ప్రకారం, అల్లాణి రామోజీరావు అనే పరమ భక్తుడికి స్వామివారు కలలో సాక్షాత్కరించి, తన విగ్రహం మంబాపూర్ అటవీ ప్రాంతంలో ఉందని వెల్లడించారు. స్వామివారి ఆజ్ఞ మేరకు ఆ విగ్రహాన్ని వెలికితీసి, కొడకంచిలోని ఈ గుట్టపై అత్యంత వైభవంగా ప్రతిష్టించారు. ఆదినారాయణ స్వామి ప్రధాన దైవంగా ఉన్న ఈ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామి ఆలయం ..ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ..ఇక్కడ శివాలయాలు కూడ ఉండటం విశేషం. అంతేకాకుండా, ఇక్కడ ఉన్న వంద ఏళ్ల నాటి రథం ఈ క్షేత్ర చారిత్రక ప్రాధాన్యతను చాటి చెబుతోంది. ఈ రథోత్సవం సమయంలో భక్తుల కోలాహలం వర్ణనాతీతంగా ఉంటుంది.

Gold Lizard Temple
భౌగోళికంగా ఈ క్షేత్రం హైదరాబాద్ నగరానికి చేరువలో ఉండటం భక్తులకు పెద్ద వెసులుబాటు. సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ నంబర్ 4 నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం కొలువై ఉంది. నగర జీవన ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలనుకునే వారికి మరియు ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి ఇది ఒక పరిపూర్ణ క్షేత్రం. అయితే, ఇంతటి మహిమలు గల ఈ క్షేత్రం ఇంకా సరైన ప్రచారానికి నోచుకోలేదు. ప్రభుత్వం ఈ ఆలయంపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులు చేపడితే కొడకంచి దక్షిణ భారత దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది.

Silver Lizard Temple
ప్రస్తుతం ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఆలయానికి చేరుకోవడానికి మెరుగైన రహదారులు, ప్రభుత్వ బస్సు సౌకర్యాలు మరియు దూరప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం వసతి గదులు (Rooms) కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మరియు పర్యాటక శాఖ ఈ క్షేత్ర విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తెలంగాణ ఆధ్యాత్మిక పర్యాటక రంగం మరింత బలోపేతం అవుతుంది. మహిమగల ఆదినారాయణ స్వామిని, కోటి లింగ సమానమైన శివలింగాన్ని దర్శించి, బల్లి దోషాల నుండి విముక్తి పొందడానికి కొడకంచి ఒక్కసారైనా సందర్శించాల్సిన పవిత్ర భూమి.
బ్రహ్మోత్సవ నిత్య పూజా కార్యక్రమములు
తేది : 22-01-2026, గురువారము, మాఘ శుద్ధ చవితి: అధ్యానోత్సవము, సాయంత్రము తొలకిసేవ తో ప్రారంభము తీర్థ ప్రసాద గోష్ఠి.
తేది : 23-01-2026, శుక్రవారము పంచమి: అధ్యానోత్సవము, సాయంత్రము తొలకిసేవ, తీర్థ ప్రసాద గోష్ఠి..
తేది : 24-01-2026, శనివారము, షష్టి: ప్రభంద సేవాకాల, ప్రాభోధి, పరమపదోత్సవము, సాయంత్రము పుట్ట బంగారు సేవ, అగ్ని ప్రతిష్ఠ
తీర్థ ప్రసాదగోష్ఠి
తేది: 25-01-2026, ఆదివారము సప్తమి: శ్రీవారి ధ్వజారోహణము, సాయంత్రము భేరి పూజ, రాత్రి కి స్వామివారి కళ్యాణోత్సవము, అశ్వసేవ్.
తేది : 26-01-2026, సోమవారము, అష్టమి: రథ సప్తమి ప్రాభోధి. మధ్యాహ్నం హోమము, బలిహరణం, తీర్థ ప్రసాద గోష్ఠి, హన్మంతసేవ,
తేది : 27-01-2026, మంగళవారము, నవమి: ప్రాభోధి, మధ్యాహ్నం హోమము, బలిహరణం, తీర్థ ప్రసాద గోష్ఠి, గరుడ ప్రతిష్ఠ గోష్టి రాత్రికి గరుడ వాహన సేవ.
తేది : 28-01-2026, బుధవారము, దశమి: ప్రాభోధి హోమం, బలిహరణం, మధ్యాహ్నం తిరువంజనము, తీర్థప్రసాద గోష్ఠి, అమ్మవారి విమానసేవ, స్వామివారి ఆలకసేవ. హోమం, బలిమరణం గోష్టి, రధప్రతిష్ట
తేది : 29-01-2026, గురువారము భీష్మ ఏకాదశి, (విశ్వావసు) మధ్యాహ్నం దిష్టికుంభం
స్వామివారి దివ్య రధోత్సవము (రధయాత్ర)
గాంధోళి, స్వామి వారి ఊరేగింపు, చక్రతీర్థం, తీర్థప్రసాద గోష్టి, హోమము.
తేది : 30-01-2026. శుక్రవారము, ద్వాదశి ప్రాభోధి, ఉదయం దోపేసేవ, హోమం, పూర్ణాహుతి, చాత్మర, ధ్వజపట ఉధ్యాసస, శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, భూతబలి, ఘటాభిషేకం, సప్తవర్ణాలు, స్వామివారి ఏకాంతసేవ గోష్టి
తేది : 31-01-2026, శనివారము, త్రయోదశి పదహారో పండగ గోష్టి. కార్యక్రమముల ముగింపు.