Tirumala : ఏడు కొండలకు గుర్తుగా ఏడు బ్రాండ్లు..!
- By Vamsi Chowdary Korata Published Date - 10:21 AM, Fri - 21 November 25
తిరుమల శ్రీవారికి అలంకరించిన పూలమాలలతో టీటీడీ అగరబత్తీలను తయారు చేస్తోంది.తందనాన, దివ్యపాద వంటి ఏడు రకాల పేర్లతో లభిస్తున్న ఈ అగరబత్తీలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వ్యర్థాలను తగ్గించి, పవిత్రతను పెంచే ఈ ఉత్పత్తి ద్వారా నెలకు రూ. 4-5 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా చెన్నై, బెంగళూరులోని ఆలయాల్లో కూడా ఈ అగరబత్తీలు లభిస్తున్నాయి.
తిరుమల శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.అయితే భక్తుల కోసం కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి అలంకరించిన పూలమాలలతో అగరబత్తీలు తయారు చేస్తున్నారు.ఈ అగరబత్తీలను మరింత పవిత్రమైనవిగా భక్తులు భావిస్తున్నారు. ఈ అగరబత్తీల తయారీలో ప్రత్యేకత ఉండటంతో, భక్తులు వీటిని ఎంతో ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ కేంద్రంలో ఎస్వీ గోసంరక్షణ శాలలో తయారు చేస్తున్నారు.మొత్తం ఏడు రకాల అగరబత్తీలకు భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దేవుడికి అలంకరించిన పూలమాలలతో ఈ అగరబత్తీలను తయారుచేయడం వల్ల వాటి పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
టీటీడీ అగరబత్తీల తయారీ కేంద్రం, ఏడు కొండలను ప్రతిబింబించేలా ప్రత్యేక పేర్లతో అగరబత్తీలను తయారు చేస్తున్నారు. దీంతో భక్తుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. 2021 సెప్టెంబర్ 13న ఎల్‌ఎస్‌నగర్‌లోని ఎస్వీగోసంరక్షణ శాల ప్రాంగణంలో.. దర్శన్ ఇంటర్నేషనల్, బెంగళూరు సహకారంతో ఈ కేంద్రం ప్రారంభమైంది. ఏడు రకాల అగరబత్తీలను ‘తందనాన, దివ్యపాద, అభయహస్త, దృష్టి, సృష్టి, ఆకృష్టి, తుష్టి’ అనే పేర్లతో పిలుస్తున్నారు. ఒక్కో రకానికి ఒక్కో పువ్వును ఉపయోగించి ఈ అగరబత్తీలను తయూరు చేస్తారు. ఈ అగరబత్తీలకు భక్తుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తిరుమల ఆలయంతో పాటు, అనుబంధ ఆలయాల్లోనూ, తెలంగాణ, చెన్నై, బెంగళూరులోని టీటీడీ ఆలయాల్లోనూ వీటిని విక్రయిస్తున్నారు.
ఈ అగరబత్తీలను భక్తుల డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోయారు. ఈ పరిస్థితిని గమనించిన టీటీడీ అధికారులు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు 2023లో మరో అదనపు యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మొత్తం 150 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వీరిలో 128 మంది మహిళలు ఉన్నారు. ఈ కేంద్రంలో రోజుకు సుమారు 27 వేల వంద గ్రాముల ప్యాకెట్ల అగరబత్తీలను తయారు చేస్తున్నారు. ఈ భారీ ఉత్పత్తితో, నెలకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది.
ప్రతిరోజూ గుడిలో స్వామి, అమ్మవార్లకు అలంకరించిన పూలమాలలను అగరబత్తీల తయారీకి ఉపయోగిస్తున్నారు. ఈ పూలను వేరు చేసి, ఆరబెట్టి, పొడి చేసి, వివిధ మిశ్రమాలను కలిపి యంత్రాల సహాయంతో అగరబత్తీలుగా మారుస్తున్నారు. గుడిలో పూజల తర్వాత తీసివేసిన పూలమాలలను వృధా చేయకుండా, వాటిని అగరబత్తీ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ, ఆ పూలను జాగ్రత్తగా వేరు చేసి, శుభ్రం చేస్తారు. తర్వాత, ఒక ప్రత్యేకమైన యంత్రంలో పెట్టి, నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద వాటిని ఆరబెడతారు. ఇలా ఆరిన పూలను మెత్తని పొడిగా మారుస్తారు. ఈ పూల పొడికి, ఇతర సుగంధ ద్రవ్యాలను, బైండర్లను కలుపుతారు. ఈ మిశ్రమాన్ని మరో యంత్రంలో పోస్తారు. ఆ యంత్రం నుంచి వచ్చే పొడిని ఉపయోగించి, అందమైన అగరబత్తీలను తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా వ్యర్థాలను తగ్గించడమే కాకుండా, పవిత్రమైన పూలతో సువాసనభరితమైన అగరబత్తీలను తయారు చేస్తున్నారు.