Rama Statue in Ayodhya: అయోధ్యలో రాముని విగ్రహం కోసం నేపాల్ నుండి శిలలు
అయోధ్యలో (Ayodhya) శ్రీరాముడి ఆలయం సిద్ధమవుతోంది. గుడి నిర్మాణానికి కావాల్సిన శిలల్ని ఎన్నో ఏళ్ల కిందటే తెచ్చిపెట్టారు.
- Author : Vamsi Chowdary Korata
Date : 02-02-2023 - 1:50 IST
Published By : Hashtagu Telugu Desk
అయోధ్యలో శ్రీరాముడి ఆలయం సిద్ధమవుతోంది. గుడి నిర్మాణానికి కావాల్సిన శిలల్ని ఎన్నో ఏళ్ల కిందటే తెచ్చిపెట్టారు. వాటితో ఆలయ నిర్మాణం నిరాటంకంగా కొనసాగుతోంది. తాజాగా రాముడి విగ్రహాన్ని (Rama Statue) తయారు చేయడం కోసం నేపాల్ నుంచి అరుదైన శాలిగ్రామ్ శిలాఖండాలను తెప్పించారు. కాళీ గందకీ నది నుంచి సేకరించిన 30 టన్నుల బరువున్న శిలల్ని ట్రక్కుల్లో నేపాల్ లోని జనక్ పూర్ నుంచి అయోధ్యకు గురువారం తీసుకొచ్చారు. వాటికి పూజారులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. శిలల్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
రెండు భారీ శిలల్లో ఒకటి 18 టన్నులు, మరొకటి 12 టన్నుల బరువు ఉన్నాయని నేపాల్ అధికారులు వెల్లడించారు. విగ్రహాల తయారీ విషయంలో వాటికి సాంకేతికంగా, శాస్త్రీయంగా అనుమతి వచ్చినట్లు తెలిపారు. శాలిగ్రామ్ శిలలను తరలించే విషయంలో నేపాల్ మాజీ ఉప ప్రధాని బిమలేంద్ర సహకారం అందించారు. సీతమ్మ వారి జన్మస్థలంగా భావించే జనక్ పూర్ లోనే బిమలేంద్ర పుట్టారు.
నేపాల్‌లో కాళీ గందకీ అనే జలపాతం ఉంది. ఇది దామోదర్ కుండ్ నుండి ఉద్భవించి.. నదిగా మారుతుంది. గణేశ్వర్ ధామ్ గండ్కీకి ఉత్తరాన 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు శిలల్ని అక్కడి నుంచి తీసుకువచ్చారు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 6,000 అడుగుల ఎత్తులో ఉంది. రెండు బండరాళ్లు దాదాపు 30 టన్నులకు పైగా బరువు ఉంటాయి’’ అని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
కేవలం కాళీ గందకీ నదీ తీరంలో దొరికే ఈ పవిత్రమైన శిలల్ని రాముడి విగ్రహాల తయారీలో వాడుతారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి అయోధ్యలో రాముడి విగ్రహం (Rama Statue) తయారీ పూర్తి కావచ్చని చెబుతున్నారు. ఈ శాలిగ్రామ్ శిలలతోనే సీతమ్మ వారి విగ్రహం కూడా తయారు చేయనున్నట్టు అయోధ్య వర్గాలు వెల్లడించాయి.
Also Read: Srikakulam: శ్రీకాకుళంలో భావనపాడు సముద్రతీరంలో విదేశీ డ్రోన్ కలకలం!