మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?
జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమి తన అక్షం మీద స్వల్పంగా వంగుతూ తిరగడం వల్ల, ప్రతి 70 నుండి 75 ఏళ్లకు ఒకసారి మకర సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది.
- Author : Gopichand
Date : 13-01-2026 - 6:24 IST
Published By : Hashtagu Telugu Desk
Makar Sankranti: మకర సంక్రాంతి పండుగ తేదీ విషయంలో ప్రతి ఏటా కొంత గందరగోళం ఏర్పడుతుంటుంది. 2026 సంవత్సరంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. కొందరు జనవరి 14 అని, మరికొందరు జనవరి 15 అని చెబుతున్నారు. అయితే పండితులు, పంచాంగకర్తల ప్రకారం దీనిపై ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది.
మకర సంక్రాంతి ఎప్పుడు? (జనవరి 15, 2026)
చాలా మంది పండితులు, జ్యోతిష్య నిపుణులు పంచాంగాల ప్రకారం.. ఈ ఏడాది మకర సంక్రాంతిని జనవరి 15, 2026న జరుపుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.
తేదీ విషయంలో గందరగోళానికి కారణం ఏమిటి?
సాధారణంగా సంక్రాంతి జనవరి 14న వస్తుంది. కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని (సంక్రమణం) బట్టి ఈ తేదీ మారుతుంటుంది. 2026, జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 03:07 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మన సంప్రదాయం ప్రకారం.. సూర్యోదయ సమయంలో ఏ తిథి లేదా ఏ రాశిలో సూర్యుడు ఉంటాడో దానికే ప్రాముఖ్యత ఇస్తారు. 14న మధ్యాహ్నం తర్వాత సంక్రమణం జరుగుతోంది కాబట్టి మరుసటి రోజు అంటే జనవరి 15 ఉదయాన్నే స్నానాలు, దానాలు, పూజలు నిర్వహించడం శాస్త్రబద్ధం.
Also Read: విరాట్ కోహ్లీ ముందున్న రెండు భారీ రికార్డులివే!
జనవరి 14న జరుపుకోవచ్చా?
కొన్ని పంచాంగాల ప్రకారం 14వ తేదీన కూడా పండుగ జరుపుకోవచ్చు. శాస్త్రాల ప్రకారం.. అర్ధరాత్రి కంటే ముందు సంక్రమణం జరిగితే ఆ రోజు మధ్యాహ్నం తర్వాత సమయాన్ని ‘పుణ్యకాలం’గా పరిగణిస్తారు. కాబట్టి జనవరి 14 మధ్యాహ్నం నుండి కూడా పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అయితే పవిత్ర స్నానాలకు 15వ తేదీ ఉదయం అత్యంత అనుకూలమైనది.
తేదీలు ఎందుకు మారుతున్నాయి? (శాస్త్రీయ కారణం)
జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమి తన అక్షం మీద స్వల్పంగా వంగుతూ తిరగడం వల్ల, ప్రతి 70 నుండి 75 ఏళ్లకు ఒకసారి మకర సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది. రాబోయే కొన్ని దశాబ్దాల పాటు మకర సంక్రాంతిని మనం ఎక్కువగా జనవరి 15వ తేదీనే జరుపుకోబోతున్నాం. గతంలో జనవరి 13న వచ్చే సంక్రాంతి, కాలక్రమేణా 14కు మారింది. ఇప్పుడు 15కు చేరుకుంది.