సంపెంగ వాగు జంపన్నవాగుగా ఎలా మారింది?..ఈ వాగులో నీరు ఎందుకు ఎర్రగా ఉంటుంది?
అమ్మవార్ల దర్శనానికి ముందు జంపన్నవాగులో స్నానం చేయడం తప్పనిసరి ఆచారంగా భావిస్తారు భక్తులు. ఈ వాగులో స్నానమాచరిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం.
- Author : Latha Suma
Date : 20-01-2026 - 4:30 IST
Published By : Hashtagu Telugu Desk
. సంపెంగ వాగు నుంచి జంపన్నవాగు వరకు చరిత్ర
. ఎర్రటి నీరు.. విశ్వాసం.. జాతర సందడి
. ఈ వాగులో స్నానమాచరిస్తే మంచి జరుగుతుందనే నమ్మకం
Medaram Jatara 2026: తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మేడారం వనదేవతల జాతరలో ఎన్నో అపూర్వ సంప్రదాయాలు కనిపిస్తాయి. సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు అడవిబాటలు తొక్కుతూ మేడారం చేరుకుంటారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, బెల్లం (బంగారం), భరిణిలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రధాన ఆచారం. ఇలా మొక్కులు తీర్చుకుంటే అమ్మవార్లు తమ కష్టాలు తీర్చుతారని కుటుంబానికి శుభం కలుగుతుందని భక్తుల అచంచల విశ్వాసం. అమ్మవార్ల దర్శనానికి ముందు జంపన్నవాగులో స్నానం చేయడం తప్పనిసరి ఆచారంగా భావిస్తారు భక్తులు. ఈ వాగులో స్నానమాచరిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం. అందుకే చలి తీవ్రంగా ఉన్నా సరి వేలాది మంది భక్తులు జంపన్నవాగులో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ అమ్మల దర్శనానికి వెళ్తారు. వనదేవతల జాతర కేవలం పండుగ మాత్రమే కాదు గిరిజనుల జీవన విధానం వారి చరిత్రకు సజీవ నిదర్శనంగా నిలుస్తుంది.
జంపన్నవాగు వెనుక ఉన్న కథ గిరిజన వీరత్వానికి ప్రతీకగా చెబుతారు స్థానికులు. కాకతీయ రాజులకు సామంత రాజుగా ఉన్న పగిడిద్దరాజు కాలంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. పంటలు పండకపోవడంతో కప్పం కట్టలేమని పగిడిద్దరాజు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిని వేడుకున్నారు. అయితే ఆయన ఆ విజ్ఞప్తిని అంగీకరించకుండా గిరిజనులపై యుద్ధం ప్రకటించారు. సంపెంగి వాగు వద్ద భీకర యుద్ధం జరిగింది. ఈ పోరులో పగిడిద్దరాజు భార్య సమ్మక్క, కుమార్తె సారలమ్మ, అల్లుడు గోవిందరాజు, మరో కుమార్తె నాగులమ్మ, కుమారుడు జంపన్న కాకతీయ సేనలను ఎదుర్కొన్నారు. యుద్ధంలో జరిగిన వెన్నుపోటుతో పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన జంపన్న తన కుటుంబ సభ్యుల మరణవార్త తెలుసుకుని శత్రువుల చేతిలో మరణించకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణమే సంపెంగి వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడని కథనం. అప్పటి నుంచే ఆ వాగు పేరు జంపన్నవాగుగా స్థిరపడింది.
జంపన్నవాగులో నీరు ఎర్రగా ఉండటానికి జంపన్న రక్తమే కారణమని స్థానికుల విశ్వాసం. ఆయన త్యాగంతో ఆ వాగు నీళ్లు ఎరుపెక్కాయని ఇప్పటికీ అదే రంగు కొనసాగుతోందని చెబుతారు. అయితే దీనిపై మరో వాదన కూడా ఉంది. జంపన్నవాగు గోదావరి నదికి ఉపనది కావడంతో గోదావరి నీటి రంగు ప్రభావం వల్ల వాగులో నీరు ఎర్రగా కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏ వాదన ఎలా ఉన్నా.. జంపన్నవాగులో స్నానం చేసి జంపన్నను ప్రార్థించిన తర్వాతే అమ్మవార్ల దర్శనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది మేడారం జాతర జనవరి 28 నుంచి 31 వరకూ జరగనుంది. భారీగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తి, విశ్వాసం చరిత్ర మేళవించిన మేడారం జాతర మరోసారి గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటుతోంది.