Color Changing Ganapayya: రంగులు మార్చుకునే గణపయ్య ఎక్కడున్నాడో తెలుసా?
కష్ఠాలను తొలగించి శుభాలను కలిగించే దైవ స్వరూపంగా గణేషుడిని కొలుస్తారు. ఏ పూజ చేసినా ముందుగా పసుపుతో తయారు చేసిన గణపయ్యని ఆరాధిస్తాం.
- Author : Vamsi Chowdary Korata
Date : 08-03-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ... నిర్విఘ్నం కురుమే దేవ... సర్వకార్యేషు సర్వదా...
కష్ఠాలను తొలగించి శుభాలను కలిగించే దైవ స్వరూపంగా గణేషుడిని కొలుస్తారు. ఏ పూజ చేసినా ముందుగా పసుపుతో తయారు చేసిన గణపయ్యని ఆరాధిస్తాం. ఆలయాల విషయానికొస్తే కాణిపాకం మొదలు ఎన్నో వినాయక ఆలయాలు.. అయితే తమిళనాడు నాగర్ కోయిల్ జిల్లా కేరళపురంలో ఉన్న పార్వతీతనయుడి ఆలయం మాత్రం ప్రత్యేకం..! శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన గణపయ్య ఆరు నెలలకోసారి తన రంగు (Color) తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం అంటే మార్చి నుంచి జూన్ వరకూ నల్ల రంగులో, దక్షిణాయన కాలం అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం..
అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు (Color) లేదు అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ మిగిలిన చోట్ల మాటేమో కానీ ఇక్కడ నీటికి కూడా రంగులు మారుతాయ్. స్వామివారు రంగులు మార్చుకున్నట్టే బావిలో నీళ్లు కూడా రంగులు మారుతాయి. అయితే స్వామివారి రంగులకు..బావిలో నీళ్ల రంగులు వ్యతిరేకంగా ఉంటాయి. అంటే వినాయకుడు నల్లగా ఉంటే బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.

ఇక్కడున్న మరో విచిత్రం ఏంటంటే.. సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మర్రిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.

ఈ ఆలయానికున్న చారిత్రక ప్రాశస్త్యం ఏంటంటే. ఇది 12వ శతాబ్ద కాలం నాటిదని, 1317 సంవత్సరంలో నిర్మించారని.. 2300 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. అప్పట్లో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండడం వల్ల ఎన్నోసార్లు పునర్మించడం జరిగింది. కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేదట. ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయినప్పుడు తమిళనాడు పరిధిలోకి రావడంతో రంగులుమారే లంబోదర ఆలయం అభివృద్ధి చెందిందని చెబుతారు.
Also Read: Sundarakanda: శని ప్రభావంతో కష్టాలు వస్తున్నాయా, ఆరోగ్యం క్షీణిస్తోందా.. సుందరకాండ చదవండి