CM Revanth Reddy : 8న యాదాద్రి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్ ప్రాజెక్ట్ పైలాన్‌ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత పైప్‌లైన్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు.
- By Latha Suma Published Date - 02:21 PM, Mon - 4 November 24

Yadadri Bhuvanagiri District : ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. అయితే అదే రోజున సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో తొలుత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత అక్కడ వైటీడీఏ (YTDA)పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులపై చర్చలు జరుపుతారు. అనంతరం భువనగిరి నియోజకవర్గ పరిధి వలిగొండ మండలంలో గల బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్ ఆధ్వర్యంలో చేపట్టబోయే మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్రలో సీఎం పాల్గొననున్నారు.
ఇక, మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్ ప్రాజెక్ట్ పైలాన్‌ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత పైప్‌లైన్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. కాగా, సీఎం యాదాద్రి టూర్ షెడ్యూల్‌ను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పర్యవేక్షిస్తున్నారు. సీఎం వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
అదేవిధంగా ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడం పనులపై ఆయన సమీక్ష చేయబోతున్నారట. దీంతో ఆలయ అభివృద్ధిపైనా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి యాదాద్రికి వస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కార్తీకమాసం కావడంతో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీఎం పర్యటనకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొదటిసారి సీఎం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.
Read Also: Beauty Tips: పచ్చి పాలతో మెరిసిపోయే చర్మాన్ని సొంతం చేసుకోండిలా!