Vallabhaneni Janardhan: మరో టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి
టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, సత్యనారాయణ రావు, చలపతిరావు వంటి సీనియర్ నటుల మరణ వార్త మరువకముందే.. మరో సీనియర్ నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు.
- Author : Gopichand
Date : 29-12-2022 - 12:10 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, సత్యనారాయణ రావు, చలపతిరావు వంటి సీనియర్ నటుల మరణ వార్త మరువకముందే.. మరో సీనియర్ నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ (Vallabhaneni Janardhan) గురువారం తుదిశ్వాస విడిచారు.
గతకొంత కాలంగా అనారోగ్యం బాధపడుతున్న జనార్ధన్‌ను కుటుంబీకులు అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూనే ఈ రోజు ఉదయం 10:20 గంటలకు కన్నుమూశారు. ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. 1959 సెప్టెంబర్ 25న ఏలూరు దగ్గరలోని పోతునూరులో వల్లభనేని జనార్ధన్ జన్మించారు. మొదటి నుంచి ఆయనకు సినిమాలపై ఆసక్తి ఎక్కువ. విజయవాడలోని లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకుని.. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు పొందారు. బాలయ్య, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. అలాగే ‘అన్వేషిత’ అనే సీరియల్‌లోనూ నటించారు. వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రముఖ దర్శక నిర్మాత విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని వల్లభనేని జనార్ధన్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక్క కొడుకు. అయితే మొదటి అమ్మాయి శ్వేత.. చిన్నవయసులోని ప్రాణాలు విడిచింది. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్‌గా.. కొడుకు అవినాశ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.