Allu Arjun To Prabhas: కో అంటే కోట్లు ఇస్తామన్నా.. నో అనేసిన రియల్ హీరోలు!!
భారీ ప్యాకేజీ ఇచ్చి.. తమ యాడ్స్ చేయాలని కోరిన కొన్ని కంపెనీలకు సింపుల్ గా నో చెప్పేసిన పలువురు దక్షిణాది నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:45 AM, Wed - 24 August 22

కో అంటే కోటి ఇస్తామంటూ ఎన్నో బ్రాండ్స్ క్యూ కట్టాయి.
అయినా వాళ్ళు టెంప్ట్ కాలేదు. సినిమాల్లో మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరోలమే అని నిరూపించుకున్నారు.
భారీ ప్యాకేజీ ఇచ్చి.. తమ యాడ్స్ చేయాలని కోరిన కొన్ని కంపెనీలకు సింపుల్ గా నో చెప్పేసిన పలువురు దక్షిణాది నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లు అర్జున్
ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అల్లు అర్జున్. ఎందుకంటే.. ఆయన తన వ్యక్తిగత ఆర్ధిక ప్రయోజనాల కంటే, ఫ్యాన్స్ ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. యాడ్ లో నటించాలంటూ.. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని.. ఏడాది క్రితం ఒక పొగాకు కంపెనీ నుంచి అల్లు అర్జున్ కు ఆఫర్ వచ్చింది. దాని విలువ కొన్ని కోట్లు. అయినా బన్నీ నో చెప్పారు. ఒకవేళ తాను పొగాకు ఉత్పత్తి యాడ్ లో నటిస్తే.. తన ఫ్యాన్స్ కు చెడు సందేశం వెళుతుంది. వాళ్ళు ధూమపానానికి అడిక్ట్ అవుతారని అల్లు అర్జున్ భావించారు. అందుకే దాన్ని రిజెక్ట్ చేశారు. ఈవిషయం తెలియడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
ప్రభాస్
హీరో ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ మంచి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఆయన ఏది పడితే ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేయరు. తమ ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేయాలంటూ ఎంతోమంది, ఎన్నో కంపెనీలు ఆయనను కలిసి కోరుతుంటాయి. కానీ వాటిలో ఏరికోరి అతికొద్ది బ్రాండ్స్ ను మాత్రమే ఎంపిక చేసుకుంటారు. గత ఏడాది వ్యవధిలో ప్రభాస్ దాదాపు రూ.150 కోట్ల విలువైన బ్రాండ్ ప్రమోషన్ ఆఫర్లను తిరస్కరించారు. కేవలం తన ఫ్యాన్స్ లోకి మంచి సందేశాన్ని పంపే బ్రాండ్స్ ను మాత్రమే ప్రమోట్ చేసేందుకు ప్రభాస్ ఇష్టపడుతున్నారు.
నందమూరి బాలకృష్ణ
మనం నందమూరి బాలకృష్ణని కమర్షియల్ ప్రకటనల్లో అస్సలు చూడం. ఎందుకంటే ఆయన యాడ్స్ లో అస్సలు యాక్ట్ చేయరు. ఏ కంపెనీని కూడా ప్రమోట్ చేయరు. ప్రేక్షకులకు కనిపిస్తే.. అది కేవలం సినిమా తెరపైనే అని ఆయన అంటారు. అందుకే ఎన్నో కంపెనీలను.. ఎన్నో ఉత్పత్తులను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేసే అవకాశాలు వచ్చినా ఆయన నో చెప్పారు. జీవితాంతం నటన తో మాత్రమే స్క్రీన్ పై కనిపించాలనే రూల్ పెట్టుకొని బాలయ్య ముందుకు వెళ్తుండటం ప్రశంసనీయం.
సింబు
ప్రముఖ దక్షిణాది నటుడు, తమిళనాడు కు చెందిన సింబు కూడా విలువలకు కట్టుబడి ఉండే మనిషి. కొంత కాలం క్రితమే ఒక లిక్కర్ బ్రాండ్ ఆయన తలుపు తట్టింది. కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. అయితే ఒక లిక్కర్ బ్రాండ్ కు ప్రచారం చేయడం ఈజీగా తన జేబు నిండుతుందేమో కానీ.. ఫ్యాన్స్ లోకి చెడు సందేశం వెళ్తుందని సింబు భావించారు. వెంటనే ఆ ఆఫర్ ను తిరస్కరించారు. సింబు నటించిన
“మానాడు” అనే సినిమా సూపర్ హిట్ అయిన వెంటనే ఈ ఆఫర్ వచ్చింది. అయినా సింబు టెంప్ట్ కాలేదు.
సాయి పల్లవి
హీరోయిన్ సాయి పల్లవి లో నటి మాత్రమే కాదు.. ఒక గొప్ప ఆలోచనాపరురాలు కూడా ఉంది. ఆమె సమాజంలో జరిగే అంశాలపై ఒక క్లారిటీతో ముందుకు వెళ్తుంటారు. ఏదైనా ఉంటే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు. రూ.2 కోట్లు ఇస్తామంటూ ఒక ఫెయిర్ నెస్ క్రీమ్ కంపెనీ వాళ్లు సాయి పల్లవి దగ్గరికి వెళ్లారు. కానీ ఆమె దాన్ని తిరస్కరించారు. ఈ భారీ డీల్ ను ఎందుకు రిజెక్ట్ చేశారు ఒక ఇంటర్వ్యూలో ఆమెను ప్రశ్నిస్తే ఇలా బదులిచ్చారు. ” అలాంటి యాడ్స్ చేయడం వల్ల వచ్చే డబ్బుతో నేనేం చేస్తాను. ఇంటికి వెళ్తాను. దోశ, చపాతీ, అన్నం తింటాను. కారులో కూర్చొని ఊరంతా ఊరేగుతాను. అంతే తప్ప ఇంకేమైనా లాభం ఉంటుందా? నేను ఏదైనా చేస్తే నా చుట్టూ ఉన్న వాళ్ల జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలి. ఆ యాడ్ చేయడం సరికాదు అనిపించింది. అందుకే చేయను అని తేల్చి చెప్పాను” అని సాయి పల్లవి వివరించారు.