పవన్ కళ్యాణ్ డబ్బుకి ఏమాత్రం లొంగని వ్యక్తి..
- Author : Vamsi Chowdary Korata
Date : 23-02-2026 - 10:11 IST
Published By : Hashtagu Telugu Desk
‘గబ్బర్ సింగ్’ (2012) సినిమా బ్లాక్‌బస్టర్ అయిన తర్వాత పవన్ కల్యాణ్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చిందని హరీశ్ శంకర్ గుర్తుచేశారు. ఆ సమయంలో ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ, అప్పట్లో షారుఖ్ ఖాన్ తీసుకునేంత భారీ రెమ్యూనరేషన్‌తో ఒక యాడ్ కోసం పవన్‌ను సంప్రదించిందని తెలిపారు. అయితే, ఆ ఉత్పత్తి ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్లలకు మంచిది కాదనే కారణంతో పవన్ కోట్ల రూపాయల ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారని హరీశ్ శంకర్ వివరించారు. ఆయన వ్యక్తిత్వానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్రంలోని రెండో పాట ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. పవన్ మెడపై చెయ్యి వేసుకునే మేనరిజానికి మాటల రూపం ఇవ్వాలనే ఆలోచనతోనే “నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే” అనే డైలాగ్ రాశానన్నారు. ఈ పాట కేవలం అభిమానం కోసం రాసింది కాదని, పవన్ జీవిత ప్రయాణం, ఆయన పడిన కష్టం, ఆయన వ్యక్తిత్వం ఇందులో ప్రతిఫలిస్తాయని తెలిపారు. చంద్రబోస్ కేవలం రెండు రోజుల్లో ఈ అద్భుతమైన పాటను రాశారని, దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో పాటాభిషేకం చేశారని కొనియాడారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. సినిమాలో ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయని, 2 గంటల 35 నిమిషాల సినిమాలో దాదాపు 2 గంటల పాటు పవన్ ను అభిమానులు కనులారా చూసి తృప్తి చెందుతారని హరీశ్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు.