Pawan Kalyan: తిరువల్లం శ్రీ పరుశురాముని సేవలో పవన్ కళ్యాణ్
శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారమైన శ్రీ పరశురాముడికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- By Gopichand Published Date - 10:54 PM, Wed - 12 February 25

Pawan Kalyan: దక్షిణ భారతదేశ పవిత్ర పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా దేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన కేరళలోని తిరువల్లం శ్రీ పరశురాముడి క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధికారులు, ప్రధాన అర్చకులు పవన్ కళ్యాణ్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఆరవ అవతారమైన శ్రీ పరశురాముడికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కండన్ సోమహరిపాద్ పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, తీర్ధప్రసాదాలు అందించారు.
Also Read: Thandel: రేపు తండేల్ సినిమా సక్సెస్ మీట్.. ప్లేస్ ఎక్కడంటే?
శివ భజన.. భక్తిపారవశ్యంలో మునిగిన పవన్
శ్రీ పరశురాముడికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ ఆలయంలో ఉన్న ఉపాలయాలైన బ్రహ్మ, దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, మత్స్యమూర్తి, వేదవ్యాస, శివాలయం, శ్రీకృష్ణ ఆలయం, గణపతి ఆలయాలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. శివాలయంలో అర్చకులు పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో భక్తులు చేస్తున్న భజన కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులుఆనంద్ సాయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికిన వారిలో ఆలయ ప్రధాన అర్చకులు కండన్ సోమహరిపాద్, ఇతర అర్చకులు కృష్ణన్ నంబూద్రి, శ్రీరాగ్, శ్రీ హరిదేవ్, శ్రీ హరిహరన్, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ సభ్యులు ఉన్నారు.