Megastar Chiranjeevi: సినీ ఇండస్ట్రీ వివాదం.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!
చిరంజీవితో భేటీ తర్వాత నిర్మాత నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమ కష్టాలను చిరంజీవికి వివరించామని చెప్పారు. దీనిపై స్పందించిన చిరంజీవి ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
- By Gopichand Published Date - 06:34 PM, Sun - 17 August 25

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమ్మె, చిన్న సినిమా నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించడానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని చిన్న నిర్మాతల బృందం కలుసుకుంది. ఈ బృందంలో నట్టి కుమార్, ఏలూరి సురేందర్ రెడ్డి, ఆచంట గోపినాథ్, పల్లి కేశవరావు, యలమంచిలి రవిచంద్ ఉన్నారు. చిరంజీవితో భేటీ తర్వాత నిర్మాత నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమ కష్టాలను చిరంజీవికి వివరించామని చెప్పారు. దీనిపై స్పందించిన చిరంజీవి ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. రేపు (ఆగస్టు 18న) ఫెడరేషన్ సభ్యులతో మాట్లాడి, వారి వాదన కూడా వింటానని చిరంజీవి చెప్పినట్లు నట్టి కుమార్ పేర్కొన్నారు.
Also Read: TG Local Body Elections : ఈ సమావేశంలోనైనా పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వస్తుందో..?
2018లో చిన్న సినిమాలకు 25% రేట్లు తగ్గిస్తామని చెప్పి అమలు చేయలేదని, ఇప్పుడు ఏ రేట్లను పెంచినా చిన్న సినిమాలకు 20% తగ్గించాలని తాము కోరినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. “గతంలో జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కొంతమంది ఇగోకి వెళ్లారు. కానీ ఈసారి మా కష్టాలను చిరంజీవికి చెప్పాం. 200 చిన్న సినిమాలు, 100 పెద్ద సినిమాలు వస్తున్నాయి. చిన్న సినిమాలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరాం. ఈ సమస్యను తానే దగ్గరుండి పరిష్కరిస్తానని చిరంజీవి మాకు హామీ ఇచ్చారు. త్వరలో ఒక మంచి వార్త చెబుతానని కూడా అన్నారు. చిరంజీవి ఏం చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తామని ఫెడరేషన్ చెప్పింది” అని తెలిపారు. చిరంజీవి ఈ సమస్యను పరిష్కరిస్తారని తాము గట్టిగా నమ్ముతున్నామని నట్టి కుమార్ పేర్కొన్నారు.