Anil Ravipudi: అనిల్ రావిపూడి మల్టీస్టారర్..
- Author : Vamsi Chowdary Korata
Date : 28-03-2026 - 10:18 IST
Published By : Hashtagu Telugu Desk
Anil Ravipudi 2027 Movie వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో క్రేజీ ప్రాజెక్టును ప్రకటించారు. విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భగవంత్ కేసరి’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఈ సంస్థ నిర్మిస్తున్న మరో భారీ చిత్రమిది. సురేష్ ప్రొడక్షన్స్, అర్చన ఈ సినిమాను సమర్పిస్తుండగా, జీ స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ ప్రాజెక్టుకు తాత్కాలికంగా #VenkyAnil5, #NKRAR2 అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు.
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఇది ఐదో సినిమా కావడం విశేషం. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘F2’, ‘F3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘MSG’ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. అలాగే, ‘పటాస్’ వంటి సూపర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడికి ఇది రెండో సినిమా. దీంతో ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ సినిమాను పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.