Allu Arjun: అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం.. న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ లో…
పుష్ప సినిమాతో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.
- By Hashtag U Published Date - 01:07 PM, Tue - 19 July 22

పుష్ప సినిమాతో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. అందుకే బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరుగుతోంది. దీంతోపాటు అరుదైన గౌరవాలు కూడా దక్కుతున్నాయి. ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ – FIA.. ఏకంగా అల్లు అర్జున్ కు లైఫ్ టైమ్ గుర్తుండిపోయే ఆఫర్ ఇచ్చింది. దీంతో అల్లువారి వారసుడు కూడా ఫుల్ హ్యాపీ.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని నిర్వహిస్తోంది. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని అటు FIA కూడా న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ ను కండక్ట్ చేయనుంది. వచ్చే నెల 21న ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి నేతృత్వం వహించే అరుదైన అవకాశాన్ని అల్లు అర్జున్ కు ఇచ్చింది. మన 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఆ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నారు.
FIA కార్యక్రమంలో భాగంగా పెద్ద కవాతును కూడా ఏర్పాటు చేశారు. ఆ కవాతుకు అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్ గా వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని FIA అధ్యక్షుడు కెన్నీ దేశాయ్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్ లో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా.. ఈ కార్యక్రమంలో టాప్ సింగర్స్ అయిన శంకర్ మహదేవన్, కైలాస్ ఖేర్ లు కూడా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
మొత్తానికి అల్లు అర్జున్ ఫేమ్ టాలీవుడ్, బాలీవుడ్ ని దాటి అమెరికా రేంజ్ లో ఎగిసిపడుతోంది. ఇప్పుడు బన్నీ పుష్ప-2 కోసం హార్డ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప-1 బాగా హిట్టవ్వడంతో.. సెకండ్ పార్ట్ ని అంతకుమించి హిట్ చేయడం కోసం దర్శకుడు సుకుమార్ బాగానే కసరత్తు చేస్తున్నారు.