Rupee: పుంజుకున్న రూపాయి.. బలహీనపడిన డాలర్!
అంతర్జాతీయ ప్రమాణం అయిన బ్రెంట్ క్రూడ్ 0.22 శాతం పెరిగి 69.57 డాలర్లు ప్రతి బ్యారెల్ ధర వద్ద ట్రేడ్ అయింది. స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం అమ్మకందారులుగా ఉన్నారు.
- By Gopichand Published Date - 11:55 AM, Fri - 26 September 25

Rupee: గత కొద్ది రోజులుగా భారత రూపాయి (Rupee) భారీగా క్షీణించింది. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి భారత మార్కెట్ నుండి విదేశీ పెట్టుబడిదారులు తమ మూలధనాన్ని ఉపసంహరించుకోవడం. దీనితో పాటు అధిక సుంకాలు (High Tariffs), హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజుల పెరుగుదల కూడా భారత కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. తాజాగా ఫార్మా రంగంపై విధించిన 100 శాతం సుంకం కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
రూపాయిలో కొంత పెరుగుదల
అయితే వారం చివరి ట్రేడింగ్ రోజు అయిన సెప్టెంబర్ 26, 2025, శుక్రవారం ప్రారంభంలో భారత కరెన్సీ కొంత బలం పుంజుకుంది. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుందనే ఆశలు, డాలర్ బలహీనపడటం కారణంగా రూపాయి 6 పైసలు బలపడింది. దీనితో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 88.70 స్థాయికి చేరుకుంది.
Also Read: IND vs PAK Final: భారత్- పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్.. పైచేయి ఎవరిదంటే?
విదేశీ మారక ద్రవ్య వ్యాపారులు (Forex Traders) మాట్లాడుతూ.. విదేశీ మూలధనం ఉపసంహరణ, అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు (Crude Oil) ధరల పెరుగుదల స్థానిక కరెన్సీ పెరుగుదలను పరిమితం చేశాయని తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 88.72 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత 88.70 వద్దకు చేరుకుంది. ఇది మునుపటి ముగింపు ధర కంటే 6 పైసలు బలపడటాన్ని సూచిస్తుంది.
స్టాక్ మార్కెట్‌లో క్షీణత
భారత రూపాయి అంతకుముందు రోజు అంటే గురువారం తన చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి అయిన 88.76 ప్రతి డాలర్ వద్ద ముగిసింది. మరోవైపు 6 ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికన్ డాలర్ స్థితిని సూచించే డాలర్ ఇండెక్స్ 0.17 శాతం తగ్గి 98.38కి చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లలో ప్రారంభ ట్రేడింగ్‌లో BSE సెన్సెక్స్ 329.66 పాయింట్లు పడిపోయి 80,830.02 వద్దకు చేరుకుంది. అదే విధంగా NSE నిఫ్టీ 50 కూడా 105.7 పాయింట్లు తగ్గి 24,785.15 వద్దకు పడిపోయింది.
క్రూడ్ ఆయిల్- ఎఫ్‌ఐఐ ప్రభావం
అంతర్జాతీయ ప్రమాణం అయిన బ్రెంట్ క్రూడ్ 0.22 శాతం పెరిగి 69.57 డాలర్లు ప్రతి బ్యారెల్ ధర వద్ద ట్రేడ్ అయింది. స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII – Foreign Institutional Investors) గురువారం అమ్మకందారులుగా ఉన్నారు. వారు నికరంగా రూ. 4,995.42 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.