Rs 2200 Crore Scam : డబ్బులు డబుల్.. రూ.2200 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్ వెలుగులోకి!
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో మరికొంత మందిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.
- By Pasha Published Date - 10:03 AM, Wed - 4 September 24

Rs 2200 Crore Scam : రూ.2200 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణాన్ని అసోం పోలీసులు బుధవారం బయటపెట్టారు. పెట్టుబడిగా డబ్బులను అందిస్తే దాన్ని డబుల్ చేసి ఇస్తామంటూ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో అసోంలోని దిబ్రూఘర్‌కు చెందిన 22 ఏళ్ల ఆన్‌లైన్ వ్యాపారి విశాల్ ఫుకాన్(Rs 2200 Crore Scam), గౌహతికి చెందిన స్వప్నిల్ దాస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో మరికొంత మందిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు. వివరాల్లోకిి వెళితే.. విశాల్ ఫుకాన్, స్వప్నిల్ దాస్‌లు తమ విలాసవంతమైన జీవితంతో ప్రజలను ఆకర్షించారు. తమ పెట్టుబడులు స్టాక్ మార్కెట్‌లో డబుల్ అవుతున్నందు వల్లే లగ్జరీ లైఫ్ జీవిస్తున్నామని వారు ప్రజలను నమ్మించారు. ఎంతోమంది వారి మాటలు నమ్మి తమ కష్టార్జితం డబ్బులను అందించారు. ఆ డబ్బులను తీసుకునేటప్పుడు 60 రోజుల్లో 30శాతం రాబడిని అందిస్తామని పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. ఇలా సేకరించిన కోట్లాది రూపాయలను బ్యాంకుల్లో దాచుకున్నారు. నాలుగు నకిలీ కంపెనీలను స్థాపించి వాటి ద్వారా అస్సామీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి ఆస్తులను కూడబెట్టుకున్నారు. దిబ్రూగఢ్‌లోని విశాల్ ఫుకాన్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి ఈ కుంభకోణానికి సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన అస్సామీ కొరియోగ్రాఫర్ సుమీ బోరా కోసం పోలీసులు ఇప్పుడు వెతుకుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
మోసపూరిత ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండాలని అసోం ప్రజలకు ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ పిలుపునిచ్చారు. తక్కువ శ్రమతో, తక్కువ కాలంలో డబ్బును రెట్టింపు చేసే వాగ్దానాలు మోసపూరితమైనవని ఆయన స్పష్టం చేశారు. వాటిని నమ్మి మోసపోవద్దన్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టే డబ్బులు డబుల్ అవుతాయనే గ్యారంటీ ఏదీ లేదన్నారు. అదంతా అపోహ మాత్రమేనని సీఎం హిమంత తేల్చి చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులపై కేసులు నమోదు చేయించామని, రాష్ట్రంలోని మొత్తం రాకెట్‌ను ఛేదిస్తామని ఆయన వెల్లడించారు. అనేక ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలు సెబీ మార్గదర్శకాలను పాటించకుండా వ్యాపారం చేస్తున్నాయని తెలిపారు. వాటిపై తప్పకుండా కొరడా ఝుళిపిస్తామని అసోం సీఎం హిమంత వార్నింగ్ ఇచ్చారు.