Ratan Tata Net Worth: మరణించే సమయానికి రతన్ టాటా సంపాదన ఎంతో తెలుసా..?
28 డిసెంబర్ 1937న జన్మించిన రతన్ టాటా అతని సంపాదనలో ఎక్కువ భాగం డబ్బు దాతృత్వానికి ఉపయోగించారు. రతన్ టాటా తన దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు.
- By Gopichand Published Date - 08:09 AM, Thu - 10 October 24

Ratan Tata Net Worth: ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ రతన్ టాటా (Ratan Tata Net Worth) బుధవారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ముంబైలోని ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. టాటా సన్స్ మాజీ చైర్మన్ 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. అక్టోబర్ 7న ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని స్వయంగా ప్రకటన విడుదల చేశారు. కానీ అక్టోబర్ 9, 2024న ప్రపంచానికి వీడ్కోలు పలికారు. రతన్ టాటా ఎంత ఆస్తి సంపాదించారో ఇప్పుడు తెలుసుకుందాం.
1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌నకు నాయకత్వం వహించారు
బుధవారం రాత్రి ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్ టాటా అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఉన్నారు. అతని నాయకత్వంలో టాటా గ్రూప్ దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. రతన్ టాటా 1991లో గ్రూప్‌కి నాయకత్వం వహించి 2012 వరకు కంపెనీ చైర్మన్‌గా కొనసాగారు.
టాటా గ్రూప్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఉప్పు నుంచి ఆకాశంలో విమానాల వరకు కంపెనీకి చెందినవి ఉన్నాయి. టాటా గ్రూప్‌లో 100 కంటే ఎక్కువ లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. వాటి మొత్తం టర్నోవర్ సుమారు $300 బిలియన్లు. దివంగత రతన్ టాటా సంపద గురించి మాట్లాడుకుంటే.. ఇటీవల కొన్ని నివేదికల ప్రకారం.. రతన్ టాటా రూ. 3800 కోట్ల సంపదను కలిగి ఉన్నట్లు సమాచారం.
ఆదాయంలో ఎక్కువ భాగం దాతృత్వానికి కేటాయింపు
28 డిసెంబర్ 1937న జన్మించిన రతన్ టాటా అతని సంపాదనలో ఎక్కువ భాగం డబ్బు దాతృత్వానికి ఉపయోగించారు. రతన్ టాటా తన దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు. దేశంలోని అగ్రశ్రేణి దాతృత్వవేత్తలలో ఒకడు. అతను తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని టాటా ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేవాడు. ఈ విరాళాలు టాటా ట్రస్ట్ హోల్డింగ్ కంపెనీకి చెందిన సంస్థలు సంపాదించిన మొత్తం సంపాదనలో 66% దోహదం చేస్తాయి.
టాటా గ్రూప్ సహాయం చేసింది
2004 నాటి సునామీ కావచ్చు లేదా దేశంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పటికీ ప్రతి సంక్షోభంలోనూ సహాయం చేయడానికి రతన్ టాటా ముందంజలో ఉన్నారు. సామాజిక కార్యక్రమాల్లోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విద్యార్థులను ఆదుకోవడంలో కూడా ఎప్పుడూ ముందుండేవాడు. కరోనా సమయంలో రూ. 1500 కోట్లను విరాళంగా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.