Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!
- By Vamsi Chowdary Korata Published Date - 12:36 PM, Thu - 16 October 25

భారతదేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. ఆ మధ్య ఫ్రెషర్లను లేఆఫ్స్ చేసిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మైసూర్ క్యాంపస్లో ట్రైనీలకు అసెస్మెంట్ టెస్టుల్లో ఫెయిల్ అయ్యారని వందల్లో ఉద్యోగుల్ని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే అప్పటి నుంచి తేరుకున్న ఇన్ఫోసిస్ పలు ఇనిషియేటివ్స్ను తీసుకొస్తోంది. ఆ మధ్య రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ పేరిట.. కనీసం 6 నెలలైనా కెరీర్ బ్రేక్ వచ్చిన మహిళల్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామని చెప్పడమే కాకుండా.. వారిని రిఫర్ చేసిన సంస్థ ఉద్యోగులకు రివార్డ్స్ కూడా ప్రకటించింది.
ఇప్పుడు మరోసారి అలాంటి ఆఫర్ ప్రకటించింది ఇన్ఫీ. ఈసారి మాత్రం మహిళలకే కాకుండా.. అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసింది. ఒక పక్కన దిగ్గజ టెక్ సంస్థల్లో లేఆఫ్స్ జరుగుతున్న క్రమంలో.. ఇన్ఫోసిస్ నియామకాలు చేపడుతుండటం గొప్ప విషయం. ఇప్పుడు ఇలా లాటరల్ హైరింగ్ నియామకాల బాధ్యతల్ని తమ సంస్థ ఉద్యోగులకే కేటాయించడం విశేషం.
దీంట్లో భాగంగా.. కొత్త ప్రతిభను వెతికి వారిని ఇన్ఫోసిస్కు రిఫర్ చేసినట్లయితే.. గరిష్టంగా 50 వేల రూపాయల వరకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ మేరకు ఉద్యోగులకు.. ఇంటర్నల్ మెయిల్లో స్పష్టం చేసింది. ముఖ్యంగా స్ట్రాటజిక్ టెక్నాలజీ గ్రూప్, ఇంజినీరింగ్, క్వాలిటీ ఇంజినీరింగ్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అండ్ సర్వీసెస్ విభాగాల్లో.. లాటరల్ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని బ్రాంచ్ల్లో ఖాళీల్ని భర్తీ చేస్తామని పేర్కొంది. పొజిషన్ను బట్టి.. కనీసం 2 నుంచి గరిష్టంగా 15 సంవత్సరాల వరకు అనుభవం ఉన్న ఉద్యోగులు అవసరమని వెల్లడించింది.
ఈ విభాగాల్లో అర్హత ఉన్న అభ్యర్థుల్ని ఉద్యోగులు రిఫర్ చేస్తే.. వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని.. సెలక్ట్ అయితే కంపెనీ ఉద్యోగులకు రివార్డ్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక్కడ లెవెల్-6 ఉద్యోగాల కోసం రిఫర్ చేస్తే రూ. 50 వేలు బోనస్ అందనుంది. లెవెల్ 5 కింద రూ. 35 వేలు, లెవెల్ 4 జాబ్స్కు రూ. 25 వేలు, లెవెల్- 3 నియామకాలకు అయితే రూ. 10 వేలు ప్రోత్సాహకంగా అందించనుంది. అయితే.. ఇక్కడ ఉద్యోగులు రిఫర్ చేసే అభ్యర్థులు.. గత 6 నెలల కాలంలో ఇన్ఫోసిస్కు సంబంధించి ఏ నియామక ప్రక్రియలో హాజరుకాని వారు ఉండాలని స్పష్టం చేసింది.
క్యూ2 ఫలితాల వేళ టీసీఎస్.. ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇన్ఫీ నుంచి ఈ శుభవార్త చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఇన్ఫీ ఇవాళ (అక్టోబర్ 16) ఫలితాల్ని ప్రకటించనుండగా.. దానికి ముందే ఉద్యోగి పనితీరుపై సమీక్ష ప్రారంభించింది. దీంతో త్వరలో వేతనాల పెంపు కూడా ఉండొచ్చని చర్చించుకుంటున్నారు.