GOLD: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన పసిడి ధరలు
- Author : Vamsi Chowdary Korata
Date : 11-06-2026 - 10:42 IST
Published By : Hashtagu Telugu Desk
బంగారం కొనుగోలుదారులకు మళ్లీ శుభవార్త అందింది. వరుసగా బంగారం ధరలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ మరోసారి రూ. 3 వేల వరకు ధర తగ్గగా.. ఇది 6 నెలల కిందటి స్థాయికి దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పతనం అవుతున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం కూడా మరో కారణం.
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడం, క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం.. ఇవి ద్రవ్యోల్బణ భయాల్ని పెంచడం వల్ల యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ పుంజుకుంటుండటంతో బంగారం కుప్పకూలుతోంది. అవును.. ద్రవ్యోల్బణం పెరిగితే.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను గరిష్ఠ స్థాయిల్లోనే ఉంచాల్సి వస్తుంది. అంటే ప్రస్తుత తగ్గించే ధోరణికి బదులుగా ఇంకా పెంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇటీవల అమెరికాలో కంపెనీలు అంచనాల్ని మించి భారీ స్థాయిలో కొత్త ఉద్యోగాలు కల్పించడంతో వడ్డీ రేట్ల పెంపు తప్పదని భావిస్తున్నారు. ఇదే జరిగితే.. డాలర్‌కు డిమాండ్ మరింత పెరిగి.. బంగారం ధర పతనం అవుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
గత 2-3 రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ భీకర దాడుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో బంగారం భారీ కుదుపులకు లోనవుతోంది. గరిష్ఠ స్థాయిల నుంచి కరెక్షన్‌కు గురవుతోంది. దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర కిందటి రోజు రూ. 3950 తగ్గగా.. మళ్లీ జూన్ 11న ఉదయం 10 గంటల సమయంలో చూస్తే మరో రూ. 2950 తగ్గి 10 గ్రాములకు రూ. 1,33,500 కు చేరింది. ఇక 2 రోజుల్లో గోల్డ్ రేటు రూ. 6900 తగ్గడం గమనార్హం.
2 రోజుల్లో రూ. 7 వేలకు పైగా తగ్గిన పసిడి ధర..
ఇక 24 క్యారెట్ల పసిడి ధర ఇవాళ (గురువారం) రూ. 3,220 తగ్గడంతో తులం రేటు హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం రూ. 1,45,640 వద్ద ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 2 రోజుల వ్యవధిలో రూ. 7520 తగ్గుముఖం పట్టింది. వెండి ధర హైదరాబాద్‌లో కేజీకి రూ. 2.60 లక్షల వద్ద స్థిరంగా ఉంది.
6 నెలల కనిష్ఠానికి గోల్డ్ రేట్లు..
ఇక గోల్డ్ రేట్లు దాదాపు 6 నెలల కిందటి స్థాయికి పడిపోవడం విశేషం. అంటే గతేడాది డిసెంబర్ – ఈ ఏడాది జనవరి మధ్య దాదాపు ఇవే ధరలు ఉండేవి. అక్కడి నుంచి భారీగా పెరుగుతూ వచ్చాయి. మళ్లీ వరుసగా తగ్గుతూ అదే స్థాయికి చేరాయన్నమాట. ఇదే ఏడాది జనవరి 29న బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరగా.. అక్కడి నుంచి సుమారు రూ. 30 వేల వరకు తగ్గడం విశేషం. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు.
ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా పుత్తడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు కిందటి రోజు ఉదయం 4170 డాలర్ల వద్ద ఉండగా.. ఇప్పుడు అది 4070 డాలర్ల స్థాయిలో ఉంది. ఇంట్రాడేలో ఇంకా పతనమై 4030 డాలర్ల స్థాయికి కూడా చేరింది. సిల్వర్ రేటు 64 డాలర్ల దిగువన ఉంది. ఇక రూపాయి విలువ ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూ. 83.65 వద్ద కొనసాగుతోంది.