IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!
- By Vamsi Chowdary Korata Published Date - 11:12 AM, Fri - 17 October 25

గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడం టెక్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోననే భయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఊరట కల్పించే విషయం వెలుగులోకి వచ్చింది. దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వేలల్లో పెరగడమే ఇందుకు కారణం. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య భారీగానే పెరిగింది. వరుస త్రైమాసికాల్లో ఆయా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచుతుండడంతో ఇక మంచి రోజులు వచ్చినట్లేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, టీసీఎస్‌లో మాత్రం భారీగా ఉద్యోగులను తొలగించడం ఆందోళన కలిగించే విషయమే. మరి ఏ కంపెనీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
భారత్‌లోని రెండో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ ఇన్ఫోసిస్‌లో ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 సెప్టెంబర్ త్రైమాసికంలో 8203 మంది ఉద్యోగుల సంఖ్య పెరిగింది. వరుసగా 5వ త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య పెరగడం శుభపరిణామం. ఏడాది క్రితంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 14,203 మేర పెరిగింది. ఇక జూన్ 2025తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే మాత్రం సెప్టెంబర్ క్వార్టర్లో ఉద్యోగుల సంఖ్య 210 మాత్రమే పెరిగింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,31,991గా ఉంది. జూన్ క్వార్టర్‌లో ఈ సంఖ్య 3,23,788 వద్ద ఉంది. బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తోన్న ఈ కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాలను అక్టోబర్ 16వ తేదీ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
దేశీయ ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్ సైతం సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సర్వీసెస్ రెవెన్యూ వృద్ధిని 3-5 శాతం నుంచి 4-5 శాతానికి సవరించింది. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఖ్యను ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,489 పెరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,26,640 వద్ద ఉంది. ఇందులో రెండో త్రైమాసికంలో 5,196, క్యూ1లో 7,180 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగంలోకి తీసుకున్నట్లు తెలిపింది. దేశంలోని 5వ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా కొనసాగుతున్న టెక్ మహీంద్రాలోనూ ఉద్యోగుల సంఖ్య భారీగానే పెరిగింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో 4,197 మంది ఉద్యోగులు పెరిగారు. ప్రస్తుతం మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,52,714గా ఉంది. అయితే, ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన చూస్తే 1559 మంది ఉద్యోగులు తగ్గారు. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఏకంగా 19,755 మంది ఉద్యోగులు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 5,93,314కు తగ్గింది. మరోవైపు కంపెనీ నెట్ ప్రాఫిట్ మాత్రం 3.8 శాతం పెరిగింది.