Gold: సెప్టెంబర్‌లో బంగారం ధర ఎలా ఉండబోతుంది?
భవిష్యత్తు ధోరణిని నిర్ణయించడంలో అంతర్జాతీయ కదలికలు కీలక పాత్ర పోషిస్తాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మానవ్ మోదీ ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ఉద్రిక్త పరిస్థితులు తగ్గడమే.
- By Gopichand Published Date - 09:16 PM, Tue - 19 August 25

Gold: భూరాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం వల్ల ఆగస్టులో గత పది రోజులుగా బంగారం (Gold) ధరలు నిరంతరంగా పడిపోతున్నాయి. ఈ నెల ప్రారంభంలో బంగారం ధరలు రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తర్వాత నుంచి ధరలు తగ్గుతుండటంతో పెట్టుబడిదారులు, వ్యాపారులు, నగల వ్యాపారులు దీనిపై నిశితంగా దృష్టి పెట్టారు. ఆగస్టు 8న బంగారం ధరలు విపరీతంగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఆ తర్వాత నుంచి పడిపోతుండటంతో ఆగస్టు 18న 22 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 9,280 ప్రతి 10 గ్రాములు, అంటే ప్రతి సవరన్‌కు దాదాపు రూ. 74,240కి చేరుకుంది.
బంగారం ధరల తగ్గుదల
బంగారం ధరలు తగ్గడం పట్ల నగల వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల చాలా కాలంగా ఆగిపోయిన కొనుగోలుదారులు మళ్లీ మార్కెట్‌లోకి వస్తారని వారు భావిస్తున్నారు. ప్రస్తుత ధరల తగ్గుదలకు గ్లోబల్ ఎకనామిక్ సంకేతాలు, భూరాజకీయ ఉద్రిక్తతలు తగ్గడమే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కమోడిటీ అండ్ కరెంట్ రీసెర్చ్ ప్రణబ్ మెహర్ ప్రకారం, రాబోయే అమెరికా ఆర్థిక గణాంకాలు, వచ్చే నెలలో జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంపై అందరి దృష్టి ఉన్నందున, వచ్చే వారం కూడా బంగారం ధరలు మిశ్రమంగా ఉండవచ్చు.
Also Read: Womens OdI World Cup: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025.. భారత జట్టు ప్రకటన!
భవిష్యత్తులో ధోరణి ఎలా ఉంటుంది?
భవిష్యత్తు ధోరణిని నిర్ణయించడంలో అంతర్జాతీయ కదలికలు కీలక పాత్ర పోషిస్తాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మానవ్ మోదీ ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ఉద్రిక్త పరిస్థితులు తగ్గడమే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో దౌత్య ప్రయత్నాల వల్ల కాల్పుల విరమణపై ఆశలు పెరిగాయి. అలాగే అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల్లో కూడా కొంత ఉపశమనం లభించింది.