2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?
ఈ బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల పెంపుదల ఈ వేతన సంఘంపైనే ఆధారపడి ఉంటుంది.
- Author : Gopichand
Date : 21-12-2025 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
Budget 2026: సాధారణ ఉద్యోగుల నుండి బడా వ్యాపారవేత్తల వరకు ప్రతి ఒక్కరూ కేంద్ర బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. జీతగాళ్లు ఆదాయపు పన్ను స్లాబుల్లో ఊరటను ఆశిస్తే, వ్యాపార వర్గాలు పన్ను రాయితీలను కోరుకుంటాయి. అయితే ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1, 2026వ తేదీ ఆదివారం వస్తోంది. దీంతో బడ్జెట్‌ను ఒకరోజు ముందుగానీ లేదా తర్వాతగానీ ప్రవేశపెడతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం గురించి ఈ బడ్జెట్‌లో ఏమైనా ప్రకటన ఉంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
2017 నుండి ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్
మోదీ ప్రభుత్వం 2017లో బడ్జెట్ సమర్పణ తేదీని ఫిబ్రవరి 1కి మార్చింది. అంతకుముందు ఫిబ్రవరి చివరి పనిదినం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావాలని, తద్వారా వివిధ శాఖలకు నిధుల కేటాయింపులో జాప్యం జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు!
ఫిబ్రవరి 1 (ఆదివారం) బడ్జెట్ ఉంటుందా?
‘బిజినెస్ స్టాండర్డ్’ నివేదిక ప్రకారం.. తేదీ మారినప్పటికీ ప్రభుత్వం ఫిబ్రవరి 1 సంప్రదాయానికే కట్టుబడి ఉండాలని భావిస్తోంది. అంటే ఆదివారం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ఈ విషయంపై ‘పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ’ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఫిబ్రవరి 1న ‘గురు రవిదాస్ జయంతి’ కూడా ఉంది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వానికి పబ్లిక్ హాలిడే కాదు. కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితం. కాబట్టి పార్లమెంట్ సమావేశాలకు దీనివల్ల ఆటంకం ఉండదు.
గతంలో కూడా ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంట్ ఆదివారాలు సమావేశమైంది. 2020లో కోవిడ్ సమయంలో అలాగే 13 మే 2012న కూడా ఆదివారం పార్లమెంట్ నడిచింది. బుద్ధ పూర్ణిమ వంటి సెలవు దినాల్లో కూడా సభలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.
8వ వేతన సంఘంపై కీలక నిర్ణయం
ఈ బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల పెంపుదల ఈ వేతన సంఘంపైనే ఆధారపడి ఉంటుంది. 8వ వేతన సంఘం అమలు చేయాలంటే భారీగా నిధులు అవసరం అవుతాయి. కాబట్టి ఈ బడ్జెట్‌లో అందుకు తగ్గట్టుగా కేటాయింపులు చేస్తారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ప్రకటన వస్తే లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అది పెద్ద ఊరట అవుతుంది.