Budget 2024: జూలై 23న దేశ బడ్జెట్.. కేంద్ర బడ్జెట్‌పై ఉన్న అంచనాలివే..!
- By Gopichand Published Date - 09:47 AM, Sun - 7 July 24

Budget 2024: జూలై 23న దేశ సాధారణ బడ్జెట్ (Budget 2024) రానుంది. జులై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను జూలై 23న సమర్పిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు శనివారం తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన ఈ మొదటి బడ్జెట్‌పై దేశం మొత్తం భారీ అంచనాలను పెట్టుకుంది. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం వ్యాపారాన్ని సులభతరం చేయడం, మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడం, మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వడం వంటి అనేక పెద్ద నిర్ణయాలు తీసుకోగలదని తెలుస్తోంది.
స్టాండర్డ్ డిడక్షన్‌లో సడలింపు ప్రకటించవచ్చు
ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్‌లో మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం.. కొత్త పన్ను విధానంలో రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులో ఉంది. ఈ బడ్జెట్‌లో దాన్ని రూ.లక్షకు పెంచవచ్చని భావిస్తున్నారు. ఇది కాకుండా గృహ రుణం తీసుకునే వారికి ఆదాయపు పన్ను చట్టం కింద కూడా మరింత ఉపశమనం లభించనుంది.
Also Read: Married 50 People: 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికూతురు.. నగలు, డబ్బులే లక్ష్యం..!
మహిళల కోసం ఎన్నో పథకాలు రావచ్చు
అంతే కాకుండా ఈ బడ్జెట్‌లో మహిళలకు ఉపశమనం కలిగించే అనేక పథకాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇందులో గ్యాస్‌పై సబ్సిడీ వంటి పథకాలు ఉండనున్నాయి. ఆరోగ్య సంరక్షణ పథకాలలో కూడా మహిళలకు ఉపశమనం కల్పించేందుకు ప్రకటనలు రావొచ్చు. ఇది కాకుండా పొదుపు ఖాతాలో రూ.10,000 వడ్డీపై ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును రూ.25,000కు పెంచవచ్చు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఈ మినహాయింపు రూ.50 వేలుగా ఉంది.
పునరుత్పాదక ఇంధనంపై దృష్టి
ఈ ఏడాది బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ నిధులు కేటాయించడంతో పాటు రక్షణ, రైల్వే, పునరుత్పాదక ఇంధన రంగాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపార సంబంధిత జరిమానాలు, కోర్టు కేసులను తగ్గించడానికి ప్రభుత్వం నియమాలను కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇందుకోసం మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కూడా ఏర్పాటు చేయవచ్చు. అంతేకాకుండా కార్మిక చట్టాల మెరుగుదలకు పూర్తి అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join