Layoffs: ఇంటెల్ ఉద్యోగులకు డేంజర్ బెల్స్.. మరోసారి ఉద్యోగాల కోత?
గతంలో క్యాడెన్స్ డిజైన్ సిస్టమ్స్‌తో సంబంధం ఉన్న లిప్-బు టాన్, ఇప్పుడు ఇంటెల్‌ను మళ్లీ నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. కంపెనీకి అవసరం లేని బిజినెస్ యూనిట్‌లను విక్రయించి మరింత శక్తివంతమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని ఆయన ప్రణాళిక.
- By Gopichand Published Date - 09:31 PM, Sat - 26 April 25

Layoffs: ప్రపంచంలో ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఇంటెల్ ఒక పెద్ద మార్పు కోసం సిద్ధమవుతోంది. ఈ వారంలో ఇంటెల్ తన సిబ్బందిలో 20 శాతం కంటే ఎక్కువ భాగాన్ని తగ్గించే (Layoffs) ప్రకటన చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. గత నెలలోనే బాధ్యతలు స్వీకరించిన కంపెనీ కొత్త సీఈఓ లిప్-బు టాన్, మేనేజ్‌మెంట్‌ను తగ్గించడం, ఇంజనీరింగ్‌పై దృష్టి పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
విషయం ఏమిటి?
ఎన్‌డీటీ ప్రాఫిట్ రిపోర్ట్ ప్రకారం.. ఈ చర్య కంపెనీ బ్యూరోక్రసీని తగ్గించడం, ఇంటెల్ మూల గుర్తింపు అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను మళ్లీ బలోపేతం చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం. ఇంతకుముందు కూడా గత సంవత్సరం ఆగస్టులో ఇంటెల్ సుమారు 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. 2024 చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1,08,900కి తగ్గింది. ఇది 2023లో 1,24,800గా ఉంది. అయితే ఈ వార్తపై ఇంటెల్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయినప్పటికీ మార్కెట్ ఈ వార్తకు సానుకూలంగా స్పందించింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ తెరిచే ముందు ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో ఇంటెల్ షేర్లు 3.5 శాతం వరకు పెరిగాయి. అయితే గత 12 నెలల్లో కంపెనీ షేర్లు సుమారు 43 శాతం పడిపోయాయి.
Also Read: Danger From The Himalayas: హిమాలయాల నుండి పొంచి ఉన్న ప్రమాదం?
కష్ట సమయాల్లో ఉన్న కంపెనీ
ఇంటెల్ ఈ మార్పు తన పోటీదారులతో పోలిస్తే ఆధిక్యాన్ని కోల్పోయిన కష్ట సమయం నుండి బయటపడే ప్రయత్నంగా ఉంది. ముఖ్యంగా ఏఐ కంప్యూటింగ్ విషయంలో న్విడియా వంటి కంపెనీలు మార్కెట్‌ను ఆకర్షించాయి. వరుసగా మూడు సంవత్సరాలుగా తగ్గుతున్న అమ్మకాలు, నష్టాలు ఇంటెల్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.
గతంలో క్యాడెన్స్ డిజైన్ సిస్టమ్స్‌తో సంబంధం ఉన్న లిప్-బు టాన్, ఇప్పుడు ఇంటెల్‌ను మళ్లీ నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. కంపెనీకి అవసరం లేని బిజినెస్ యూనిట్‌లను విక్రయించి మరింత శక్తివంతమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని ఆయన ప్రణాళిక. ఈ దిశలోనే గత వారం ఇంటెల్ తన ప్రోగ్రామబుల్ చిప్ యూనిట్ అల్టెరా 51 శాతం వాటాను సిల్వర్ లేక్ మేనేజ్‌మెంట్‌కు విక్రయించాలని నిర్ణయించింది.
ఇంటెల్ మళ్లీ నిలబడటానికి చాలా సమయం పడుతుంది
టాన్ ఇటీవల చెప్పిన ప్రకారం.. ఇంటెల్ తన ఇంజనీరింగ్ టాలెంట్‌ను తిరిగి తీసుకురావాలి. బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయాలి. తయారీ ప్రక్రియలను కస్టమర్ అవసరాలకు అనుగుణంగా మార్చాలి. గురువారం ఇంటెల్ తన మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. అప్పుడు టాన్ తన వ్యూహాన్ని మరింత వివరంగా వివరిస్తారని భావిస్తున్నారు. అయితే వాల్ స్ట్రీట్ అంచనాల ప్రకారం.. ఇంటెల్ అమ్మకాల్లో క్షీణత అత్యంత దారుణమైన దశ అని తెలుస్తోంది.