Ambani Stocks : దూసుకెళ్తున్న అంబానీ స్టాక్.. ఒక్కరోజే 15 శాతం అప్..!
- By Vamsi Chowdary Korata Published Date - 01:56 PM, Fri - 10 October 25

దేశీయ ఐటీ కంపెనీలు కార్పొరేట్ ఫలితాల సీజన్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గురువారం రోజే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించగా.. కిందటి రోజే ఐటీ స్టాక్స్ అన్నీ పుంజుకున్నాయి. ఇదే క్రమంలో ఇతర హెవీ వెయిట్ స్టాక్స్ కూడా లాభాల్లో పయనిస్తున్నాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో శుక్రవారం సెషన్లో (మధ్యాహ్నం 1.15 గంటలకు) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా పెరిగి 82,540 స్థాయిలో కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిప్టీ 120 పాయింట్లు పుంజుకొని 25,300 స్థాయిలో ఉంది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ రిలయన్స్ పవర్ షేర్ ధర శుక్రవారం రోజు ఇంట్రాడేలో ఏకంగా 15 శాతం వరకు పెరిగింది. ఈ క్రమంలోనే రూ. 50.73 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. కిందటి సెషన్లో ఈ స్టాక్ ధర రూ. 44.45 వద్ద ముగియగా ఇవాళ నష్టాల్లో ప్రారంభమై అక్కడి నుంచి భారీగా పెరగడం విశేషం.
ఇదే సమయంలో రిలయన్స్ గ్రూప్ నుంచి మరో కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ కూడా పుంజుకుంటోంది. కిందటి సెషన్లో రూ. 230.33 వద్ద ముగిసిన ఈ షేర్ ధర శుక్రవారం రోజు 5 శాతం అప్పర్ సర్క్యూట్తో రూ. 241.84 వద్ద స్థిరపడింది.ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ రూ. 9.87 వేల కోట్లుగా ఉంది. ఇక్కడ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 423.40 కాగా.. కనిష్ట ధర రూ. 198.13 గా ఉంది.