Small Cars: CAFE నిబంధనలు సవరణ.. చిన్న కార్లకు ఉపశమనం!
గతంలో ప్రతిపాదించిన ముసాయిదాలో స్ట్రాంగ్ హైబ్రిడ్‌లకు డెరోగేషన్ ఫ్యాక్టర్‌ను 2 నుండి 1.2కి తగ్గిస్తే తాజాగా BEE దానిని 2 వద్ద యథాతథంగా ఉంచింది. ఈ నిర్ణయం మారుతి సుజుకి, టయోటా వంటి స్ట్రాంగ్ హైబ్రిడ్ విక్రేతలకు పెద్ద ఊరటనిచ్చింది.
- By Gopichand Published Date - 09:45 PM, Tue - 30 September 25

Small Cars: దేశంలో ఇంధన సామర్థ్యం, ఉద్గార నియంత్రణల కోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ఇటీవల కీలకమైన CAFE-3, CAFE-4 నిబంధనల ముసాయిదాను సవరించి విడుదల చేసింది. ఈ సవరణల ద్వారా తొలిసారిగా చిన్న కార్ల (Small Cars) తయారీదారులకు ప్రత్యేక ఉపశమనం లభించగా స్ట్రాంగ్ హైబ్రిడ్, ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాలకు కూడా భారీ ప్రోత్సాహకాలు దక్కాయి. ఈ నిబంధనలు ఏప్రిల్ 2027 నుండి మార్చి 2037 వరకు అమల్లోకి రానున్నాయి.
చిన్న కార్లకు ప్రత్యేక రాయితీ
ఆటోమొబైల్ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసిన ఈ నిబంధనల్లో చిన్న కార్లకు ప్రత్యేక రాయితీ ఇవ్వాలని మారుతి సుజుకి అభ్యర్థించగా.. టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు వ్యతిరేకించాయి. అయితే BEE విడుదల చేసిన సవరించిన ముసాయిదాలో “చిన్న కార్లను” ప్రత్యేక వర్గంగా గుర్తించారు. 909 కిలోల వరకు బరువు, 1,200 సీసీ లేదా అంతకంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4,000 మి.మీ కంటే ఎక్కువ పొడవు లేని పెట్రోల్ కార్లను చిన్న కార్లుగా పరిగణిస్తారు. ఈ చిన్న కార్లు తమ సాంకేతికత ద్వారా సాధించిన CO₂ పొదుపుతో పాటు, తమ ప్రకటించిన ఉద్గారం నుండి అదనంగా 3 g CO₂/km తగ్గించుకునేందుకు అనుమతి లభిస్తుంది.
Also Read: Daughter Killed Her Mother : ట్యాబ్లెట్లు వేసుకోలేదనే కోపంతో కన్న తల్లిని చంపిన కూతురు
దేశంలో చిన్న కార్ల అతిపెద్ద తయారీదారు అయిన మారుతి సుజుకికి ఈ మార్పుతో గణనీయమైన లబ్ధి చేకూరనుంది. అయితే ఈ తగ్గింపు ఏ రిపోర్టింగ్ వ్యవధిలోనూ 9 g CO₂/km కంటే మించకూడదు అని స్పష్టం చేశారు.
హైబ్రిడ్, ఈవీలకు అనుకూలం
గతంలో ప్రతిపాదించిన ముసాయిదాలో స్ట్రాంగ్ హైబ్రిడ్‌లకు డెరోగేషన్ ఫ్యాక్టర్‌ను 2 నుండి 1.2కి తగ్గిస్తే తాజాగా BEE దానిని 2 వద్ద యథాతథంగా ఉంచింది. ఈ నిర్ణయం మారుతి సుజుకి, టయోటా వంటి స్ట్రాంగ్ హైబ్రిడ్ విక్రేతలకు పెద్ద ఊరటనిచ్చింది. దీంతో పాటు కార్బన్ న్యూట్రాలిటీ ఫ్యాక్టర్ (CNF)ను ప్రవేశపెట్టారు. E20-E30 ఫ్యూయెల్ బ్లెండ్స్ వాడే పెట్రోల్ కార్లకు 8 శాతం ఉద్గార తగ్గింపు. ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇథనాల్ లేదా ఫ్లెక్స్ ఫ్యూయెల్‌పై నడిచే సామర్థ్యం ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్‌లకు ఏకంగా 22.3 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే ప్రస్తుతం విక్రయిస్తున్న మారుతి, టయోటా హైబ్రిడ్‌లు సాధారణ పెట్రోల్‌పై నడుస్తున్నాయి. కాబట్టి ఈ పూర్తి 22.3% CNF ప్రయోజనం పొందాలంటే తయారీదారులు ఫ్లెక్స్-ఫ్యూయెల్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌లను మార్కెట్‌లోకి తీసుకురావాల్సి ఉంటుంది. నూతన CAFE నిబంధనలపై తమ స్పందనలను తెలియజేయడానికి వాటాదారులకు 21 రోజుల గడువు ఇవ్వబడింది.