Passenger Vehicle: దసరా సీజన్‌లో భారీగా అమ్మకాలు.. సెప్టెంబర్‌లో ఆటో రంగం 6% వృద్ధి!
GST 2.0 రేట్ల తగ్గింపు అన్ని ఆదాయ వర్గాలలో కొనుగోలు శక్తిని, అధిక వర్షాలు, బలమైన ఖరీఫ్ పంట గ్రామీణ కొనుగోలు శక్తిని పెంచాయని ఫాడా పేర్కొంది.
- By Gopichand Published Date - 05:35 PM, Wed - 8 October 25

Passenger Vehicle: పండుగ సీజన్ ప్రారంభం భారత ఆటోమొబైల్ (Passenger Vehicle) రంగానికి తిరుగులేని ఉత్సాహాన్ని అందించింది. ముఖ్యంగా నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా ప్రయాణీకుల వాహనాల రిటైల్ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 35 శాతం పెరిగాయి. దీని ఫలితంగా సెప్టెంబర్ నెల మొత్తం రిజిస్ట్రేషన్లు 6 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) మంగళవారం ప్రకటించింది.
GST 2.0తో మార్పు
నెల ప్రారంభంలో వినియోగదారులు GST 2.0 రేట్ల తగ్గింపు కోసం వేచి చూడటంతో అమ్మకాలు మందగించాయి. అయితే సెప్టెంబర్ 22న కొత్త GST రేట్లు అమలులోకి రావడంతో పాటు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్ మాట్లాడుతూ.. “తగ్గించిన GST రేట్ల అమలు, పండుగ వాతావరణం ఏకకాలంలో రావడంతో వినియోగదారుల సెంటిమెంట్ పెరిగి, డెలివరీలు వేగవంతమయ్యాయి. నవరాత్రి కాలంలో డీలర్‌షిప్‌లలో రికార్డు స్థాయిలో జనాభా, వాహనాల డెలివరీలు జరిగాయి” అని తెలిపారు. మొత్తం నెలలో మూడు-చక్రాల వాహనాలు మినహా అన్ని విభాగాలు సానుకూల వృద్ధిని చూపించాయి. మొత్తం అమ్మకాలలో 5 శాతం పెరుగుదల నమోదైంది.
Also Read: Record In AP History: ఏపీ చరిత్రలోనే రికార్డు.. రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం!
విభాగాల వారీగా వృద్ధి ఇలా
ప్రయాణీకుల వాహనాలు: నవరాత్రిలో 2,17,744 యూనిట్లకు పెరిగాయి (గత ఏడాది 1,61,443 యూనిట్లు). నెల మొత్తంలో 2,99,369 యూనిట్లు అమ్ముడయ్యాయి.
రెండు-చక్రాల వాహనాలు: నవరాత్రిలో అమ్మకాలు 36 శాతం పెరిగి 8,35,364 యూనిట్లకు చేరాయి. నెల మొత్తం అమ్మకాలు 7 శాతం పెరిగాయి.
ట్రాక్టర్లు: నవరాత్రిలో 19 శాతం పెరిగాయి.
వాణిజ్య వాహనాలు: 3 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
నెల మొత్తం మీద అన్ని విభాగాల్లో కలిపి మొత్తం అమ్మకాలు 18,27,337 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే నవరాత్రి మొత్తం అమ్మకాలు గత ఏడాది కంటే 34 శాతం అధికంగా నమోదయ్యాయి.
దీపావళిపై మరింత ఆశాభావం
GST 2.0 రేట్ల తగ్గింపు అన్ని ఆదాయ వర్గాలలో కొనుగోలు శక్తిని, అధిక వర్షాలు, బలమైన ఖరీఫ్ పంట గ్రామీణ కొనుగోలు శక్తిని పెంచాయని ఫాడా పేర్కొంది. ధంతేరాస్, దీపావళి పండుగల సీజన్‌లో ఇదే సానుకూల వాతావరణం కొనసాగుతుందని, ఈ పండుగ సీజన్ భారతదేశ చరిత్రలోనే అత్యుత్తమ రిటైల్ సీజన్‌గా నిలిచే అవకాశం ఉందని ఫాడా ఆశాభావం వ్యక్తం చేసింది. తగ్గిన ధరలు, ఆకర్షణీయమైన ఆఫర్‌లు కొత్త కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. తద్వారా రాబోయే అక్టోబర్‌లో బంగారు దశ ప్రారంభమవుతుందని ఫాడా విశ్వాసం వ్యక్తం చేసింది.