Electric Scooter: దేశంలో ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
మీరు కొత్త ఇస్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే కొంత కాలం ఆగండి. ఎందుకంటే మార్కెట్‌లో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది.
- Author : Maheswara Rao Nadella
Date : 04-03-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) కోసం చూస్తున్నారా? అది కూడా హై రేంజ్ స్కూటర్ అయితే బాగుంటుందని యోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచింది. దేశంలో నెంబర్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కానుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ చాలా ఎక్కువ. ఓలా, ఏథర్ వంటి వాటితో పోలిస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ దాదాపు రెట్టింపు ఉంటుంది. అంటే ఎంత దూరం వెళ్లొచ్చొ అర్థం చేసుకోవచ్చు.
ఒక్కసారి చార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిపోవచ్చు. ఇంతకీ అది ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బ్రిస్క్ ఈవీ అనే కంపెనీ తాజాగా హై రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు చెందిన ఈ బ్రిస్క్ ఈవీ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) మార్కెట్‌లో సరికొత్త విప్లవాన్ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది. ఆరిజిన్, ఆరిజిన్ ప్రో అనేవి ఇవి.
హైదరాబాద్ ఇ మోటార్ షో కార్యక్రమంలో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రదర్శించారు. బ్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 330 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అంటే దేశంలో ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం గమనార్హం. ఓలా, ఏథర్, టీవీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా బ్రిస్క్ ఈవీ అందిస్తున్న రేంజ్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లన తయారు చేయకపోవడం గమనార్హం. ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. ఇది కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. కంపెనీ ఇందులో 4.8 కేడబ్ల్యూహెచ్ ఫిక్స్‌డ్ బ్యాటరీ, 2.1 కేడబ్ల్యూహెచ్ స్వాపబుల్ బ్యాటరీని అమర్చింది.
ఈ స్కూటర్‌లోని మోటార్ కెపాసిటీ 5.5 కేడబ్ల్యూగా ఉంది. ఇంకా ఇందులో ఓటీఏ బ్లూటూత్, మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. దీని రేటు రూ. 1.2 లక్షల నుంచి రూ. 1.4 లక్షల దాకా ఉండే అవకాశం ఉందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఆరిజిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) విషయానికి వస్తే.. దీని రేంజ్ 175 కి.మి. అంటే ఒక్కసారి ఫుల్‌గా చార్జింగ్ పెడితే ఇది 175 కిలోమీటర్లు వెళ్లనుంది. ఇది కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మి వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర దాదాపు రూ. 80 వేల దాకా ఉండొచ్చని తెలుస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. ఇందులో కూడా ఓటీఏ బ్లూటూత్, మొబైల్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. కంపెనీ 2023 అక్టోబర్ నెలలో వీటిని మార్కెట్‌లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
Also Read: Foxconn: బెంగళూరులో ఐఫోన్ ఉత్పత్తి ప్లాంట్.. ఫాక్స్‌కాన్‌కు 300 ఎకరాల భూమి