మరింత చవగ్గా కొత్త 390 డ్యూక్.. 350cc ఇంజిన్‌తో లాంచ్!
కొత్త 350cc డ్యూక్ పెర్ఫార్మెన్స్ విషయంలో డ్యూక్ ఆర్ అంత దూకుడుగా లేకపోయినప్పటికీ దీని ధర సామాన్యులకు అందుబాటులో ఉంది.
- Author : Gopi
Date : 21-04-2026 - 3:15 IST
Published By : Hashtagu Telugu Desk
KTM Launches: భారతీయ బైక్ మార్కెట్లో ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. KTM ఇండియా తన పాపులర్ డ్యూక్ సిరీస్‌లో కొత్త 350cc వెర్షన్‌ను లాంచ్ చేసింది. విశేషమేమిటంటే.. ఈ అడుగు కేవలం కొత్త మోడల్‌ను తీసుకురావడానికే కాదు, ధరను అదుపులో ఉంచడానికి, ఎక్కువ మంది కస్టమర్లకు చేరువవడానికి వేసింది. ఇప్పుడు 390 Duke మునుపటి కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో ఈ సెగ్మెంట్‌లో ఇది మరింత బలోపేతం కానుంది.
ధర, వేరియంట్లలో మార్పులేంటి?
కొత్త 350cc ఇంజన్ గల KTM 390 Duke ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.77 లక్షలుగా నిర్ణయించబడింది. అదే సమయంలో దీని పాత 399cc మోడల్‌ను ఇకపై ‘KTM 390 Duke R’ పేరుతో విక్రయిస్తారు, దీని ధర రూ. 3.39 లక్షలు. గమనించదగ్గ విషయం ఏంటంటే.. ఇటీవల Duke R ధరను రూ. 40,000 పెంచారు. దీనివల్ల ఈ రెండు బైక్‌ల మధ్య ధరల వ్యత్యాసం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
350cc వెర్షన్ తీసుకురావడానికి కారణం
KTM 350cc ఇంజన్ వెర్షన్‌ను తీసుకురావడానికి ప్రధాన కారణం కొత్త GST నిబంధనలు. 350cc కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 40% పన్ను విధిస్తారు. అందుకే, 349cc ఇంజన్‌తో రావడం వల్ల ఈ బైక్ కస్టమర్లకు మరింత చౌకగా మారింది. దీనివల్ల ఈ మోడల్ 399cc వెర్షన్ కంటే దాదాపు రూ. 62,000 తక్కువ ధరకు లభిస్తోంది. కంపెనీ ఈ రెండు వెర్షన్లను కలిపి విక్రయించనుంది.
Also Read: పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన
ఇంజన్- పెర్ఫార్మెన్స్‌లో తేడాలు
కొత్త డ్యూక్‌లో 349cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 41 bhp పవర్, 33.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా 399cc ఇంజన్ 45 bhp, 39 Nm అవుట్‌పుట్‌ను ఇస్తుంది. కాగితంపై చూస్తే పెర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినట్లు కనిపిస్తోంది. KTM ఇంజన్ స్ట్రోక్‌ను 56.1 mmకు తగ్గించింది (గతంలో 64 mm ఉండేది). అయితే బోర్ 89 mm గానే ఉంచింది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు క్విక్‌షిఫ్టర్ కూడా అందించారు.
హార్డ్‌వేర్- ఫీచర్లలో ప్రత్యేకతలేంటి?
హార్డ్‌వేర్ విషయంలో కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. ఈ బైక్‌లో అదే స్ప్లిట్-ట్రెల్లిస్ ఫ్రేమ్, అడ్జస్టబుల్ సస్పెన్షన్, శక్తివంతమైన బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. సీటు ఎత్తు 800mm నుండి 820mm మధ్య ఉంటుంది. బరువు 163.8 కిలోలుగా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, మల్టిపుల్ రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ABS వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.
తక్కువ ధర, ఎక్కువ మంది కస్టమర్లపై ఫోకస్
కొత్త 350cc డ్యూక్ పెర్ఫార్మెన్స్ విషయంలో డ్యూక్ ఆర్ అంత దూకుడుగా లేకపోయినప్పటికీ దీని ధర సామాన్యులకు అందుబాటులో ఉంది. ఎక్కువ అమ్మకాలు సాధించాలనే వ్యూహంలో భాగంగానే KTM ఈ అడుగు వేసినట్లు కనిపిస్తోంది. దీనితో పాటు కంపెనీ 350cc ఇంజన్‌తో KTM 390 Adventureను కూడా లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.81 లక్షలుగా ఉంది.