YSRCP Mind Game: వైసీపీ మైండ్ గేమ్ లో టీడీపీ, జనసేన చిక్కుకుంటాయా? పొత్తుపై ఏం తేల్చుతాయి?
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది. పొత్తుల విషయంలో ఇప్పుడు పార్టీల మధ్య తీవ్ర విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కల్యాణ్ ఆమధ్య అన్నారు.
- By Hashtag U Published Date - 11:25 AM, Sun - 8 May 22

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది. పొత్తుల విషయంలో ఇప్పుడు పార్టీల మధ్య తీవ్ర విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కల్యాణ్ ఆమధ్య అన్నారు. అందుకే అన్ని పార్టీలు కలిసి రావాలని ఓ ప్రతిపాదన కూడా చేశారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ కూడా జనసేనతో పొత్తుకు అనుకూల సంకేతాలు పంపిస్తోంది. అటు బీజేపీతో పొత్తుకు కూడా ఆసక్తి ఉన్నట్టు సిగ్నల్స్ ఇస్తోంది. ఇప్పటికైతే జనసేనతో బీజేపీకి పొత్తుంది. టీడీపీతో మాత్రం కలనని చెబుతున్నా. భవిష్యత్ రాజకీయాలను ఇప్పుడే అంచనా వేయలేం. సరిగ్గా ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
అప్పుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నప్పుడే ఆయనపై దాడి చేసింది. టీడీపీకి దత్తపుత్రుడని.. టీడీపీకి జనసేన బీ పార్టీ అని విమర్శించింది. ఇప్పుడు టీడీపీని టార్గెట్ చేసింది. పొత్తుల్లేకుండా టీడీపీ గెలవగలదా అని ప్రశ్నించింది. జగన్ సింగిల్ గా వస్తారని.. టీడీపీ కూడా పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాలంటూ సవాల్ విసిరింది. పొత్తు లేకుండా గెలిచిన చరిత్ర టీడీపీకి లేదని విమర్శించింది. అంటే తెలుగుదేశంపార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా చూడాలన్నదే వైసీపీ వ్యూహం. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని దానివల్ల లబ్ది కలుగుతుందని వైసీపీ ఆశిస్తోంది.
రాజనీతి శాస్త్రంలో ‘ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ’ (Index Of Opposition Unity) ఉంటుంది. అంటే ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఎంత బలంగా ఉందో దానిని బట్టి అధికారపార్టీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఒక్కోసారి ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఐక్యంగా 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తే అధికారపక్షానికి ఓటమి తప్పదు. కానీ ఇది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఒక్కోసారి 30 శాతం ఓట్లు వచ్చినా సరే ఆ పార్టీ గెలిచేస్తుంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినప్పుడు జరుగుతుంది. అందుకే వైపీసీ ఇప్పుడు ఇలాంటి సందర్భాన్ని కోరుకుంటోంది.
గత ఎన్నికల్లో వైసీపీకి 49.95 శాతం ఓట్ షేర్ వచ్చింది. ఓట్ల రూపంలో చూస్తే.. 1,56,88,569 ఓట్లు పోలయ్యాయి. దీని ద్వారా 151 సీట్లు గెలుచుకుంది. అదే తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే.. 39.26 శాతం ఓట్ షేర్ వచ్చింది. దీని ద్వారా 1,23,04,668 ఓట్లను సాధించింది. దీంతో ఆ పార్టీకి 23 సీట్లు వచ్చాయి. అంటే వైసీపీ, టీడీపీ మధ్య ఓట్ షేర్ లో తేడా 10.69 శాతం. ఇక ఓట్ల పరంగా చూస్తే.. రెండు పార్టీల మధ్య తేడా… 33,83,901 ఓట్లు. అంటే దాదాపు 34 లక్షల ఓట్ల తేడాతో టీడీపీ కోల్పోయిన సీట్లు ఎన్నో తెలుసా? 128 సీట్లు. ఇక్కడ పవన్ కల్యాణ్ పార్టీ జనసేన గురించీ చెప్పుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటును గెలుచుకుంది. ఆ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ 5.54 శాతం. ఇక ఓట్ల పరంగా చూస్తే.. 17,36,811 ఓట్లు. అసలు లాజిక్కు ఇక్కడే ఉంది.
ఒకవేళ గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన కానీ కలిసి పోటీ చేస్తే.. కచ్చితంగా అధికారంలోకి వచ్చేవాళ్లమని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే జనసేనకు వచ్చిన దాదాపు ఐదు శాతం ఓట్ షేర్ కాని టీడీపీకి జతకలిస్తే.. దాని ద్వారా ఓట్లు పెరిగేవి. అదే క్రమంలో సీట్లూ పెరిగుండేవి. ఎందుకంటే టీడీపీకి, వైసీపీకి మధ్య ఉన్న ఓట్ల తేడా దాదాపు 34 లక్షలు. ఇందులో సగం ఓట్లను.. అంటే దాదాపు 17 లక్షల ఓట్లను జనసేన గెలుచుకుంది. సో.. పవన్ కాని టీడీపీకి మద్దతిచ్చి ఉంటే.. ఆ ఓట్లన్నీ ఉమ్మడిగా ఉండే అభ్యర్థులను గెలిపించి ఉండేవి. దానివల్ల టీడీపీకి, వైపీసీకి మధ్య ఉన్న 128 సీట్ల తేడా కూడా సగమైనా తగ్గుండేదని అంచనా. అదే జరిగితే.. వైసీపీ అధికారంలోకి వచ్చుండేది కాదంటున్నారు. అందుకే ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇదే వైసీపీకి గుబులు పెంచుతోంది. అందుకే.. ఆ రెండు పార్టీలు కలవకుండా మైండ్ గేమ్ ఆడుతోంది.
మొత్తానికి పొత్తు అంశం.. ఏపీలో వైసీపీకి, టీడీపీకి, జనసేన మధ్య రాజకీయ సెగలను మరింతగా రాజేసింది.
Tags
- andhra pradesh politics
- chandrababu naidu
- jagan mohan reddy
- Jana Sena
- Pawan Kalyan
- tdp
- TDP Jana Sena alliance
- ysrcp

Related News

Pawan Kalyan in TS: తెలంగాణపై పవన్ కదలిక
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి చిన్నాచితక పార్టీల రోల్ కీలకం కానుంది.