Andhra Pradesh: ఏపీ హోంమంత్రిని కలిసిన వైఎస్ సునీత
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అనితను వైఎస్ సునీత కోరారు. ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ విచారణకు సహకరించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి అనిత సునీతకు హామీ ఇచ్చారు.
- By Praveen Aluthuru Published Date - 01:23 PM, Wed - 7 August 24
Andhra Pradesh: దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha)ను కలిశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇష్యూపై వైఎస్ సునీత మంత్రి అనితతో మాట్లాడారు. తన తండ్రి హత్యకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అనితను వైఎస్ సునీత కోరారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర హోం మంత్రిగా అనిత ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తొలి ప్రతిపాదన మహిళలకు అన్యాయం జరగకుండా చూడటమే. అందులో భాగంగానే వైఎస్ సునీత హోంమంత్రిని కలిశారు. గత ప్రభుత్వ హయాంలో విచారణ ప్రక్రియ నీరుగారిందని, తన తండ్రిని హత్య చేసిన వాళ్ళు సమాజంలో ఆనందంగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం కొనసాగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.అంతేకాకుండా ఈ కేసులో సీబీఐ అధికారులు, సాక్షులు బెదిరింపులకు గురయ్యారని, దర్యాప్తును అడ్డుకునేందుకు తమపై తప్పుడు కేసులు పెట్టారని సునీత ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు విచారణకు అడ్డుపడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని ఆమె కోరారు.
ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ విచారణకు సహకరించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి అనిత సునీతకు హామీ ఇచ్చారు. హత్యకు కారణమైన వారు తగిన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొనేలా చూడడానికి రాష్ట్రం అంకితభావంతో ఉందని ఆమె పునరుద్ఘాటించారు. ఇకపోతే అనితతో సమావేశం అనంతరం వైఎస్ సునీత సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అపాయింట్మెంట్ కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
Also Read: Neeraj Chopra : నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే.. మీకు రివార్డు ఇస్తానంటున్న రిషబ్ పంత్