YS Sharmila : ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ – వైస్ షర్మిల
- By Sudheer Published Date - 03:36 PM, Thu - 8 February 24

ఏపీ సర్కార్ విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఏపీ నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ను ఎట్టకేలకు ఏపీ సర్కార్ బుధువారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అది కూడా సరిగ్గా ఎన్నికలు రెండు నెలల్లో ఉండనున్న క్రమంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికల వ్యూహాన్ని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ (Mega DSC) అంటూ మాటలు చెప్పి ఓట్లు వేసుకున్న జగన్ (CM Jagan)..అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరచిపోయారు. గత నాలుగేళ్లుగా డీఎస్సీపై ఊసెత్తని ప్రభుత్వం..ఇక ఇప్పుడు డీఎస్సీ ప్రకటన చేసింది.
ఈ ప్రకటన ఫై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. ఇప్పటికే టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రావు ‘అప్పుడు ఎన్నికలకు ముందు 25వేల పోస్టులతో DSC అని పదే పదే ఊదరగొట్టి.. 5ఏళ్ల తరువాత ఇప్పుడు 6,100 పోస్టులతో మమ అనిపించాలని చూస్తున్నారు. ఈ ఫేక్ నోటిఫికేషన్ ఎన్నికల తాయిలం మాత్రమే. అధికారంలోకి వచ్చాక అన్ని బ్యాక్లాగ్ పోస్టులను చంద్రబాబు భర్తీ చేస్తారు’ అని ట్వీట్ చేయగా..తాజాగా కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ షర్మిల మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ విమర్శలు కురిపించారు. ఉద్యోగాలు లేక యువత రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారని, డీఎస్సీ ప్రకటన కేవలం ఎన్నికల స్టంటేనని మండిపడ్డారు. చెత్త ఆలోచన ఉన్న ప్రభుత్వం పోతేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడే మద్యం మృతులు ఎక్కువని, లిక్కర్ బ్రాండ్, పేరు, ధర ప్రభుత్వమే నిర్ణయించి దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
తెనాలి నియోజక వర్గం కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..లిక్కర్ పేరుతో చెప్పిన మద్యాన్ని మాత్రమే అమ్మాలని రూల్ తెచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మొత్తం దోచేశారు. రాష్ట్రంలో కల్తీ లిక్కర్‌తో 25 శాతం అదనంగా మరణాలు సంభవిస్తున్నాయి. లిక్కర్ వ్యాపారం గుప్పిట్లో పెట్టుకున్నట్లు.. ప్రజల భూములను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది. ఒక మనిషిని పెడతారట.. ఆయన చెప్పినట్లే భూ లావాదేవీలు ఉండాలట. ఇదేం చట్టం… భూములపై సొంత హక్కులు హరించే చట్టం తేవడం ఏంటి..?. ఇలాంటి చట్టాలు తెచ్చే YCP ప్రభుత్వం మళ్ళీ రావాలా ? ప్రజలు తేల్చుకోవాలి. లాండ్ టైటిల్ యాక్ట్.. వ్యతిరేకిస్తున్నాం. రాష్ర్టంలో అన్ని ధరలు పెంచారు. చెక్కెర, నూనె, కూరగాయలు ఇలా అన్నింటి ధరలూ పెంచారు’’.
ఒక చేత్తో మట్టి చెంబు ఇస్తూ…మరో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఏవి ప్రజలకు అందడం లేదు.. ఉద్యోగాలు లేవు.. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు 7వేల పోస్టులు ఇస్తే హేళన చేశాడు. వైసీపీ వస్తే 25 వేల పోస్టులు ఇస్తామన్నారు. మెగా డీఎస్సీ నీ దగా డీఎస్సీ చేశాడు. 25 వేలు అని చెప్పి ఎన్నికల ముందు 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పెరిగాయి. మన బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా వలసలు పోవాలా ? . 25 లక్షల ఇళ్లు అని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు.. జగన్ అన్నది దగా ప్రభుత్వం. మన బిడ్డల భవిష్యత్ మారాలి. ఉద్యోగాలు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి.. దోచుకునే ప్రభుత్వాలు పోవాలి. మాఫియాలు చేసే ప్రభుత్వం పోవాలి’’ అని షర్మిల అన్నారు.
Read Also : Nara Lokesh : ఎన్నికల ‘శంఖారావం’ పూరించేందుకు లోకేష్ సిద్ధం