YS Jagan Press Meet : కూటమి సర్కార్ పై విరుచుకుపడ్డ జగన్
YS Jagan Press Meet : రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగం తూట్లు పొడుస్తోందని, రాష్ట్రంలో లిక్కర్ స్కామ్‌లు, సాండ్ స్కామ్‌లు కనపడుతున్నాయి.. పేకాట క్లబ్‌లు, మాఫీయా వ్యవహారం నడుస్తోంది
- By Sudheer Published Date - 06:42 PM, Thu - 28 November 24

మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan) గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా (Pressmeet) తో మాట్లాడారు. ఈ సందర్బంగా తన ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాల పై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇవ్వడం తో పాటు కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేసారు. గత ఐదేళ్లు విప్లవాత్మక అడుగులు పడితే ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్నీ వెనక్కిపడుతున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగం తూట్లు పొడుస్తోందని, రాష్ట్రంలో లిక్కర్ స్కామ్‌లు, సాండ్ స్కామ్‌లు కనపడుతున్నాయి.. పేకాట క్లబ్‌లు, మాఫీయా వ్యవహారం నడుస్తోంది.
ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకి, ఎమ్మెల్యేకు ఇంతా అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్రలో గుర్తించిన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రయత్నం తాను చేసానని , DBT ద్వారా లంచాలు లేకుండా సంక్షేమం అందించాం.. అవినీతికి తావులేకుండా సచివాలయాల ద్వారా అన్ని సేవలు ప్రజలకు అందించాం.. రూ.2.73 లక్షల కోట్లు DBT ద్వారా అవి6నీతి, వివక్ష లేకుండా మేం ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ బడులతో ప్రైవేట్ బడులు పోటీ పడేలా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. ఆరోగ్య ఆసరా, మెడికల్ కాలేజీలు, RBK, ఉచిత పంటల బీమా వంటివి ఎన్నో మా హయాంలో తీసుకొచ్చాం’ అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. బడ్జెట్తో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారు.రాష్ట్రంలో లిక్కర్, ఇసుక స్కామ్తో పాటు ఎక్కడ చూసినా పేకాట క్లబ్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోంది’ అని మండిపడ్డారు.
‘కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్ల ఉద్యోగం పోయింది. సచివాలయ వ్యవస్థ అగమ్యగోచరంగా ఉంది. రూ.2800 కోట్ల విద్యా దీవెన బకాయిలు, రూ.1100 కోట్లు వసతి దీవెన బకాయిలు పెట్టడంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదు. 108, 104 పడకేశాయి’ అని ఆరోపించారు. చంద్రబాబు గత పాలనలో దిక్కుమాలిన రేట్లకు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని జగన్ ఆరోపించారు. విండ్ విద్యుత్కు సంబంధించి యూనిట్ రూ.4.84, సోలార్కు రూ.6.49కు ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో సోలార్ యావరేజ్ రూ.5.90 అయితే, తాము రూ.2.49కి సెకీతో ఒప్పందం చేసుకోవడంపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు పాలనలో PPAల వల్ల రాష్ట్రానికి ఏటా రూ.1500 కోట్ల నష్టం వస్తుందన్నారు.
సెకీతో YCP హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై వచ్చిన ఆరోపణలపై జగన్ స్పందించారు. ‘మనం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం తీపికబురు అందించింది. తక్కువ రేటుకు విద్యుత్ ఇస్తామని సెకీ చెప్పింది. ISTS ఛార్జీలు లేకుండా రూ.2.49కి యూనిట్ విద్యుత్ ఇస్తామంది. రైతుల పట్ల ప్రభుత్వం చూపిన శ్రద్ధను అభినందించింది. AP చరిత్రలోనే అతి తక్కువ రేటుకు చేసుకున్న విద్యుత్ ఒప్పందం ఇది. దీనిపై ఆరోపణలా?’ అని మండిపడ్డారు సగటున యూనిట్ విద్యుత్ కోసం రూ.5.10 ఖర్చు చేస్తున్నామని, కానీ యూనిట్ రూ.2.49కే అందించేందుకు సెకీ ముందుకొచ్చిందని జగన్ తెలిపారు. 17వేల మిలియన్ యూనిట్లు తీసుకోవడంతో యూనిట్కు రూ.2.61 సేవ్ అయినట్లేనని చెప్పారు. ఏడాదికి రూ.4,400 కోట్ల చెప్పున 25 ఏళ్లకు రూ. లక్ష కోట్లు ఆదా అయినట్లేనని వెల్లడించారు. ఇది రాష్ట్రానికి సంపద సృష్టి కాదా? అని ధ్వజమెత్తారు.
Read Also : Victory Celebrations: ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు.. డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిగే కార్యక్రమాలివే!