YS Jagan : ఆ రెండు అంశాలు జగన్ కు ఇబ్బందే!
''ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనేక హామీలు ఇస్తాం. అవన్నీ సాధ్యమా?కాదా? అనేది అధికారం లోకి వచ్చాక తెలుస్తుంది''
- By CS Rao Published Date - 12:57 PM, Mon - 19 September 22

”ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనేక హామీలు ఇస్తాం. అవన్నీ సాధ్యమా?కాదా? అనేది అధికారం లోకి వచ్చాక తెలుస్తుంది” ఇదీ, కొన్నాళ్ల కిందట కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై చేసిన వ్యాఖ్యలు. అప్పట్లో ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏపీలోనూ వచ్చేలా కనిపిస్తోంది. కీలకమైన అంశాల్లో సర్కారు మడమ తిప్పక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో వచ్చే ఎన్నికల్లో మాటతప్పిన అంశాలను ప్రత్యర్థి పార్టీలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సిద్ధం అవుతున్నాయి.
దీంతో వైసీపీ నాయకులు ”తెలివిలేదు..తెలియలేదు.. తొందరపడ్డాం..” అని ప్రజలకు చెప్పేందుకు రెడీ అయ్యారట. ఇంతకీ ఏం జరిగిందంటే, రెండు కీలక విషయాల్లో వైసీపీ సర్కారు అడ్డంగా దొరికిపో యింది. అందులో ఒకటి ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని ఇచ్చిన హామీ. ఆ హామీనిఎన్నికలకు ముందు భారీగానే ప్రచారం కల్పించారు. అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్ రద్దు చేస్తానని జగన్ ఆనాడు హామీ ఇచ్చారు. అయితే, మూడేళ్లు దాటిపోయినా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపైనే ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తాము చేయలేమని స్పష్టం చేస్తోంది. అంతేకాదు, ఇప్పటికే సజ్జల ఒకటికి రెండు సార్లు `తెలియక హామీ ఇచ్చాం` అంటూ చెప్పుకొచ్చిన విషయం విదితమే.
Also Read: Jagan Politics: లోకేష్, పవన్ కు జలక్ ఇచ్చేలా జగన్ ఎత్తుగడ
ఇక రెండో మరో కీలక హామీ మద్య నిషేధం. విడతల వారీగా నిషేధిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రతి వేదికపైనా ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అక్కచెల్లెమ్మల తాళిబొట్లకు రక్షణగా ఉంటామని ఊదరకొట్టారు. మద్యనిషేధం విషయంలో పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. మౌలిక ప్రమాణాలను మెరుగుపరిచే దృష్టితో రాష్ట్రంలో ఆల్కహాల్ వినియోగ స్థాయులను తగ్గించే విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సన్నాయినొక్కులు నొక్కడం ప్రారంభించారు. నిషేధం ఎప్పటిలోగా చేస్తారని ప్రశ్నిస్తే, తేదీ, నెల లేదా సంవత్సరమని సమాధానం ఇవ్వాలి. అలా కాకుండా కేవలం వినియోగాన్ని తగ్గిస్తామని మాత్రమే ప్రభుత్వం చెబుతోంది. అంటే మద్య నిషేధం అనే మాటే లేదని స్పష్టం అయిపోయింది.
ఈ రెండు అంశాలపైనే వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. దీంతో ఆ రెండు హామీలపై ప్రజలకు అసలు విషయాన్ని వివరించాలని వైసీపీ ఇప్పటికే సిద్ధం అయింది. వాస్తవానికి సంపూర్ణ మద్య నిషేధంపై ఇప్పటి వరకూ ప్రజలకు ఏ మూలనో ఉన్న చిన్న ఆశ కూడా ఇప్పుడు కరిగిపోయింది. ఇక సీపీఎస్ రద్దు అంశాన్ని మసిపూసీమారేడుకాయలా చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. అందుకే, ప్రజలను క్షమాపణ అడిగే పరిస్థితికి వచ్చేస్తున్నారని తెలుస్తోంది.
Related News

Motha Mogiddam : పవన్ కళ్యాణ్ కూడా మోత మోగిస్తాడా..?
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ 'మోత మోగిద్దాం' (Motha Mogiddham) అనే వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.