YS Jagan : వైఎస్ జగన్‌కు హైకోర్టులో ఊరట
Jagan Passport Renewal: తన పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్.. అయితే, ఐదేళ్ల పాటు పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేయాలని తీర్పు వెలువరించింది హైకోర్టు.
- Author : Latha Suma
Date : 11-09-2024 - 1:15 IST
Published By : Hashtagu Telugu Desk
Jagan Passport Renewal: ఏపీ మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తన పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్.. అయితే, ఐదేళ్ల పాటు పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేయాలని తీర్పు వెలువరించింది హైకోర్టు.. పాస్‌పోర్ట్ విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యువల్‌ను ఐదేళ్లకు పెంచుతూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తన పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఐదేళ్ల పాటు పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేయాలని ఆదేశించింది. దీంతో జగన్ లండన్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది.
పాస్ పోర్ట్ కు ఐదేళ్ల పాటు రెన్యువల్ చేసేలా ఆదేశాలు..
కాగా, పాస్ పోర్ట్ రెన్యూవల్‌పై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు వైఎస్ జగన్.. మరోవైపు.. సీబీఐ కోర్టు పాస్‌పోర్ట్ రెన్యువల్‌కు ఐదేళ్లు అనుమతిస్తే, విజయవాడ కోర్టు కేవలం ఏడాదికి అంగీకారం తెలిపింది.. ఇక, ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇప్పటికే ఇరువైపు వాదనలు ముగియగా.. ఈనెల 11న ఈ వ్యవహారంపై నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొన్న విషయం విదితమే కాగా.. ఈ రోజు తీర్పు వెలువరించింది హైకోర్టు.. పాస్ పోర్ట్ కు ఐదేళ్ల పాటు రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది.. అయితే, విజయవాడ ప్రజా ప్రతినిధులు కోర్టు ఆదేశాలు ప్రకారం 20 వేల పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.. మొత్తంగా ప్రజా ప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన పాస్ పోర్ట్ రెన్యువల్‌ను ఐదేళ్లకు పెంచుతూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో.. వైఎస్ జగన్‌కు ఊరట లభించింది.
మరోవైపు సీఎంగా ఉన్న సమయంలో జగన్‌కు డిప్లొమాట్ పాస్ పోర్టు ఉండేది. ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ పాస్ పోర్టు రద్దు అయింది. జనరల్ పాస్ పోర్టు కోసం జగన్ దరఖాస్తు చేశారు. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసుపై ఎన్‌వోసీ తీసుకోవాలని జగన్‌కు ఇటీవల పాస్ పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది. దీంతో ఎన్వోసీ ఇవ్వాలంటూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు.