20 Lakh Jobs : రాష్ట్రంలో నిరుద్యోగులకు ’20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం’ – మంత్రి నారా లోకేష్
20 Lakh Jobs : రాష్ట్రంలోని అన్ని సమస్యలకు పరిష్కారం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమేనని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 09:24 PM, Mon - 3 November 25
రాష్ట్రంలోని అన్ని సమస్యలకు పరిష్కారం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమేనని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తక్కువ కాలంలోనే ఏపీలో పెట్టుబడుల వెల్లువ కురుస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. గత 16 నెలల్లో రూ. 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షించడం తమ పాలన విజయమని అన్నారు. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉందని, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడంలో తమ ప్రభుత్వ విధానం కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. సమర్థవంతమైన నాయకత్వం, అనుభవజ్ఞులైన అధికార వ్యవస్థ కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని లోకేశ్ గర్వంగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న భారీ పెట్టుబడుల వివరాలు వెల్లడించిన లోకేశ్, ఇవి రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తాయని పేర్కొన్నారు. అనకాపల్లిలో అర్సెల్లార్ మిత్తల్ రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టబోతోందని, విశాఖలో గూగుల్ ఏకంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నదని తెలిపారు. ఈ పెట్టుబడి దేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) చరిత్రలోనే అతిపెద్దదని ఆయన గర్వంగా చెప్పారు. అలాగే నెల్లూరులో బీపీసీఎల్ రూ. 1 లక్ష కోట్లు, ఎన్టీపీసీ రూ. 1.60 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఈ పెట్టుబడుల వల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. దేశంలో స్వదేశీ పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని లోకేశ్ తెలిపారు. ఈ పెట్టుబడులు కేవలం పరిశ్రమలను మాత్రమే కాదు, రాష్ట్రంలోని యువత భవిష్యత్తును కూడా మారుస్తాయని ఆయన అన్నారు.
Electric Scooter Sales: అక్టోబర్‌లో ఏ బైక్‌లు ఎక్కువగా కొనుగోలు చేశారో తెలుసా?
రాష్ట్ర అభివృద్ధికి కొత్త అధ్యాయంగా రాబోయే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సమ్మిట్ నిలుస్తుందని అన్నారు. ఈ సమ్మిట్‌లో 45 దేశాల నుండి 300 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని, 410కి పైగా ఒప్పందాలు (MoUs) కుదరనున్నాయని తెలిపారు. మొత్తం 120 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైకాపా విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. “వైకాపా కులం, మతం పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోంది. గూగుల్ పెట్టుబడులపై కూడా వారు తప్పుడు ప్రచారం చేశారు. కానీ అభివృద్ధి విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి పనిచేస్తాం” అని లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం తమ ప్రధాన ధ్యేయమని, యువతకు ఉపాధి కల్పించి “స్వయం సమృద్ధి ఆంధ్రప్రదేశ్” నిర్మించడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ అన్నారు.