CM Chandrababu : డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నాం.. ఆపేదే లేదు: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు చెప్పారు. కొంతమంది గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాం.
- By Latha Suma Published Date - 05:16 PM, Tue - 11 March 25

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతో కీలకమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయించారని విమర్శించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో అధికార వైసీపీని ప్రశ్నిస్తే, టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు చెప్పారు. కొంతమంది గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాం. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చాం. గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఎకరాలో కూడా గంజాయి పండించకుండా చర్యలు తీసుకుంటాం. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నాం.. ఆపేదే లేదు అని సీఎం స్పష్టం చేశారు.
Read Also: Hindu Mutton Shops: హిందువుల మటన్ షాపులకు ‘మల్హర్ సర్టిఫికేషన్’.. ఏమిటిది ?
మహిళల భద్రత కోసం శక్తియాప్‌ను ప్రారంభించామన్నారు. మహిళలు శక్తియాప్ ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేస్తే.. ఆ వెంటనే 6 నుంచి 9 నిముషాల్లో పోలీసులు వచ్చి రక్షిస్తారన్నారు. పోలీసులు అప్రతత్తంగా ఉండాలని లేకుంటే వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం తెచ్చిన దిశా యాప్ దిక్కుమాలిన యాప్‌గా తయారైందని విమర్శించారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. 26 జిల్లాల్లో సైబర్ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అని సీఎం తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే కచ్చితంగా శాంతిభద్రతలు అదుపులో ఉండాల్సిందే. ముఠాలు, కుమ్ములాటలు, రౌడీలను అణచివేస్తాం. అటవీ భూములను కూడా అక్రమించేసిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో జరిగింది. అందుకే భూ కబ్జాలు జరగకుండా కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకువచ్చాం. శాంతి భద్రతల విషయంలో డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ చేయిస్తున్నాం. నేరం రుజువైతే రెండు మూడు నెలల్లోనే శిక్షలు పడేలా కార్యాచరణ రూపొందించామన్నారు.
45 ఏళ్లు రాజకీయాలు చేశా. ఎవరైనా హత్యా రాజకీయాలు చేసినా.. ప్రజా క్షేత్రంలో పోరాడి అలాంటివారిని శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేశా. రాజకీయ ముసుగులో నేరాలు-ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటామంటే సాగనివ్వను అన్నారు. నా జీవితంలో రాజకీయ కక్షలనేవి ఉండవని చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లు అసెంబ్లీలో బూతులు విన్నాం. సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయారు. ఇప్పుడు అసెంబ్లీలో బూతులు లేవు సమస్యలపైనే చర్చలు చేస్తున్నాం. ఆడబిడ్డలపై అత్యాచారం చేసి తప్పించుకోవాలని అనుకుంటే అదే చివరి రోజు అవుతుంది. రౌడీయిజం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు.
Read Also: TGPSC : తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల