Durga Temple : వివాదాలకు నిలయంగా దుర్గగుడి.. ఈవో వైఖరిపై..?
బెజవాడ ఇంద్రకీలాద్రి వివాదాలకు నిలయంగా మారింది. ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయంగా పేరుగాంచిన...
- Author : Prasad
Date : 30-09-2022 - 7:31 IST
Published By : Hashtagu Telugu Desk
బెజవాడ ఇంద్రకీలాద్రి వివాదాలకు నిలయంగా మారింది. ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయంగా పేరుగాంచిన ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. అయితే ఉత్సవాల నిర్వహణ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఉత్సవాలు ప్రారంభమైన తొలిరోజు నుంచి ఆలయంలో ఏదోక వివాదం బయటికి వస్తుంది.తాజాగా కనకదుర్గమ్మ సన్నిధిలో అంతరాలయం దర్శనం విషయంలో ఆలయ అధికారుల తీరుపై ఉభయదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రూ.3000 పెట్టి టిక్కెట్ కొంటే అంతరాలయ దర్శనం ఇవ్వడం లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఈవో భ్రమరాంబను ఉభయదాతలు నిలదీశారు. అయితే వారికి నచ్చజెప్పాల్సిన ఈవో…ఉభయదాతలు దండం పెడుతూ.. నేను అంతరాలయ దర్శనం ఇవ్వను ఏమి చేసుకుంటారో చేసుకోండి. నాతో గొడవ పడితే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటూ హెచ్చరించారు. జరిగిన దాన్ని వీడియో తీస్తున్న మీడియానుపైన ఈవో భ్రమరాంభ కస్సుబుస్సుమన్నారు. మీకు వీడియోలు తీయడం సరదానా అంటూ ఈవో మీడియాపై దురుసుగా ప్రవర్తించారు.
మరోవైపు పోలీసులు, వారి కుటుంబలకు అంతరాలయ దర్శనానికి అనుమతివ్వడంతో ఉభయదాతలు ఈవోతో గొడవకు దిగారు. వారిని పంపి రూ.3000 టికెట్ కొన్న మమ్మల్ని ఎందుకు పంపారు అని ఈవోతో వాగ్వాదానికి దిగారు. ప్రతి ఏడాది ఉభయ దాతలకు అంతరాలయ దర్శనం, గోత్రనామాలను చదివి, పాదుకలు ఇచ్చి పెట్టి, ఆశీర్వచనం అందించడం జరుగుతుంది. అయితే ఉభయదాతల విషయంలో ఈవో తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దసరా ఉత్సవాల నిర్వహణలో ఆలయ ఈవో ఫెయిల్ అయ్యారని భక్తులు అంటున్నారు. ఆలయ అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు ఆలయంలోకి వస్తున్న అర్చక స్వాములను సైతం నిలిపివేయడంతో వారు ఆందోళనకు దిగారు. కొండపై ప్రతిఏడాది దసరా ఉత్సవాలకు పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. పాస్ లు ఉన్నప్పటికీ మీడియా, అర్చకస్వాములను నిలిపివేస్తూ నానా రచ్చ అయ్యే వరకు వెళ్తుంది. అటు పోలీసుల కుటుంబ సభ్యులకు మాత్రం కొండపై అమ్మవారి దర్శనానికి రెడ్ కార్పెట్ వేసుకుంటున్నారు. దగ్గరుండి తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేయిస్తున్నారు.