Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశి(Vallabhaneni Vamsi) పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు.
- By Pasha Published Date - 08:15 AM, Sat - 24 May 25

Vallabhaneni Vamsi : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దీంతో ఆయనను కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులతో పేర్ని నాని మాట్లాడి వంశీ ఆరోగ్యంపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ఆయన ధైర్యం చెప్పారు. వంశీకి వైద్యం నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన కేసులో ప్రస్తుతం వల్లభనేని వంశి(Vallabhaneni Vamsi) పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీని 2 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చింది. ఈక్రమంలో కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వైద్యులు ఆక్సిజన్ పెట్టి వంశికి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉంటే విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేస్తామని వైద్యులు తెలిపారు.
Also Read :Kavitha vs KCR : ‘కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ‘ ఉన్నాయి – కవిత
వంశిని ఎయిమ్స్‌కు తరలించాలి :పేర్ని నాని
ఈసందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. వంశీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. తప్పుడు కేసులు పెట్టి మనిషిని చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం, అది చూసి పైశాచిక ఆనందం పొందడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే వంశిని ఎయిమ్స్‌కు తరలించాలని, ఆరోగ్యం బాగోలేక ఇబ్బందిపడుతుంటే కేసుల పేరుతో వేధించడం సరికాదని పేర్ని నాని కోరారు. వంశీ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కాగా, వల్లభనేని వంశీపై ఇప్పటివరకు 8 కేసులు నమోదయ్యాయి. గత 100రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు.