TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు.. మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం!
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
- By Gopichand Published Date - 09:54 PM, Wed - 5 November 25
TTD Chairman: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Chairman) ఛైర్మన్‌గా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న బీఆర్ నాయుడు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీ పాలక మండలి చేపట్టిన కీలక సంస్కరణలు, నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం, అన్నప్రసాదంలో మార్పులు, అన్యమతస్తుల తొలగింపు, టీటీడీ ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు.
తొలి నిర్ణయమే సంచలనం
టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకున్న తొలి నిర్ణయం గురించి నాయుడు వెల్లడించారు. “మొదటి సమావేశంలోనే టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
దర్శనంలో విప్లవాత్మక మార్పులు
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాక బ్రేక్ దర్శనం సమయాల్లో కూడా మార్పులు తీసుకొచ్చినట్లు ప్రకటించారు. శ్రీవాణి దర్శనం సమయాలను మార్చడం ద్వారా కూడా భక్తులకు దర్శనం సులభతరమైందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Also Read: Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!
అన్నప్రసాదం, లడ్డూ నాణ్యత పెంపు
లడ్డూ ప్రసాదంలో నాణ్యతను పెంచామని నాయుడు పేర్కొన్నారు. శ్రీవారి అన్నప్రసాదంలో మార్పులు తీసుకొచ్చి, వడను కూడా ప్రవేశపెట్టామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో నిత్యాన్న ప్రసాదం అందిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి స్థానికులకు నెలకు ఒక మంగళవారం స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
5,000 ఆలయాల నిర్మాణం, అభివృద్ధి
టీటీడీ ద్వారా దేశవ్యాప్తంగా 5,000 శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయించామని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారని ఛైర్మన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లో ఈ ఆలయాలు నిర్మించబడతాయి. ఈ సంఖ్య భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాలు నిర్మించబోతున్నామని, ఇప్పటికే రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని వివరించారు. ఒంటిమిట్టలో భక్తుల సౌకర్యార్థం వంద గదులతో వసతి గృహ నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
స్విమ్స్ ఆస్పత్రికి 71 కోట్లు
స్విమ్స్ ఆస్పత్రి నిర్వహణ, అభివృద్ధి, ఆర్థిక వనరుల సమీకరణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ఆస్పత్రికి రూ. 71 కోట్లు కేటాయించారు. స్విమ్స్‌లో జరుగుతున్న మెడికల్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తూ, రోగుల సౌకర్యార్థం ఆస్పత్రి ఆధ్వర్యంలోనే మెడికల్ షాపుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.