AP Govt Vs Tollywood : ఏపీ హీరోల తెలంగాణ కథ
టాలీవుడ్ కు, విభజిత ఏపీకి సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. అక్కడి భారీ కలెక్షన్లు కావాలని సినీ పరిశ్రమ కోరుకుంటోంది. కానీ, ఏపీ ప్రజల బాగోగులపై ప్రముఖులు ఎవరూ కన్నెత్తి చూడడంలేదు. సినీ పరిశ్రమ తరలి రావాలని ఏపీకి చెందిన పలువురు ఆందోళన చేసిన సందర్భాలు అనేకం.
- By CS Rao Published Date - 04:41 PM, Fri - 24 December 21

టాలీవుడ్ కు, విభజిత ఏపీకి సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. అక్కడి భారీ కలెక్షన్లు కావాలని సినీ పరిశ్రమ కోరుకుంటోంది. కానీ, ఏపీ ప్రజల బాగోగులపై ప్రముఖులు ఎవరూ కన్నెత్తి చూడడంలేదు. సినీ పరిశ్రమ తరలి రావాలని ఏపీకి చెందిన పలువురు ఆందోళన చేసిన సందర్భాలు అనేకం. అక్కడ షూటింగ్ లు చేయడానికి కూడా సినీ పెద్దలు ఉత్సాహం చూపడంలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న విధానపరమైన అంశాలపై ఎవరూ నోరెత్తి మాట్లాడడంలేదు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి హీరోలు ముందుకు రావడంలేదు. ఏదో ఉడతాభక్తిగా విరాళాలను పరిమితం అవుతున్నారు.టాలీవుడ్ లోని హీరోలు దాదాపు అందరూ ఏపీకి సంబంధించిన వాళ్లే. అందుకే, సినిమా పరిశ్రమను ఒకానొక సందర్భంలో కేసీఆర్ టార్గెట్ చేశాడు. ఉద్యమ సమయంలో సినిమా షూటింగ్ లను అడ్డుకున్నాడు. కొందరి ఇళ్ల మీదకు ఉద్యమకారులను పంపాడు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ అడుగుల్లో అడుగు వేస్తూ తెలుగు పరిశ్రమలోని పెద్దలు చాలా వరకు నడుస్తున్నారు. కొందరు కేసీఆర్ ఇంటిలో మనుషుల్లా కలిసి పోయారు. ఏపీ గురించి దాదాపుగా వాళ్లు మరిచిపోయారు.
రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో జరిగిన తెలుగు సభలకు టాలీవుడ్ హీరోలు క్యూ కట్టారు. ఫోన్ కాల్ తో కేసీఆర్ పంచన చేరిపోయారు. నంది అవార్డులు ఇవ్వకపోయినప్పటికీ డిమాండ్ చేసే ధైర్యం టాలీవుడ్ కు లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. ఏపీ ఎఫ్ డీసీ నుంచి టాలీవుడ్ అనేక రకాలుగా లబ్ది పొందింది. ఆనాడు స్టూడియోలను ఏపీలో పెట్టాలని చంద్రబాబు ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకు కదలలేదు. సీఎంగా జగన్ వచ్చిన తరువాత టాలీవుడ్, ఏపీ మధ్య లింకు బలహీనపడింది.జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మర్యాద పూర్వకంగా కలవడానికి టాలీవుడ్ ప్రముఖులు తొలి రోజుల్లో తటపటాయించారు. ఆ విషయం మీడియాకు ఎక్కడంతో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు తదితరులు జగన్ ను కలిశారు. ఆ తరువాత మరోసారి ఇదే టీం కలిసింది. ఆ సందర్భంగా సినీ కార్మికులకు భూములు ఇవ్వాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. కరోనా సమయంలో ఏపీ ప్రజల గురించిగానీ, ఆ రాష్ట్రం పరిస్థితి గురించిగానీ సినీ పరిశ్రమ పట్టించుకున్న దాఖలాలు దాదాపుగా లేవు.

Ramanaidu Studios
కరోనా ఉధృతి తగ్గిన తరువాత బెనిఫిట్ షోలకు, సినిమా టిక్కెట్లకు కళ్లెం వేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నాడు. ఆనాటి నుంచి టాలీవుడ్ కు, ఏపీ సర్కార్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఆ క్రమంలో హైకోర్టు వరకు జీవో నెంబర్ 35ను టాలీవుడ్ ప్రముఖులు తీసుకెళ్లారు. డివిజన్ బెంచ్ ఆ జీవోకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో జగన్ సర్కార్ కొరఢా ఝళిపించింది. ఫలితంగా థియేటర్ల మూసివేత, సీజ్ కొనసాగుతోంది.తెలుగు సినిమా షేర్ ఎక్కువగా ఏపీ ప్రేక్షకులదే. నైజాం, సీడెడ్, ఆంధ్రా మూడు భాగాలు సినిమా షేర్లను చెబుతుంటారు. సీడెడ్, ఆంధ్రా అంటే రాయలసీమ, ఆంధ్రా రెండూ ఏపీ కి చెందినవే. ఇక నైజాం తెలంగాణ పరిధిలోనిది. తొలి నుంచి నైజాం షేర్ తక్కువగా ఉండేది. ఇప్పుడు మల్టీప్లెక్స్ లు ఎక్కువగా నైజాంలో ఉన్నప్పటికీ సినిమాను ఆదరించే వాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందుకే, హీరో నాని కామెంట్ల మీద ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఫైర్ అయ్యాడు. సినిమా షేర్ గురించి తెలియకుండా మాట్లాడొద్దని హితవు పలికాడు. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను పెంచడం గమనార్హం. ఏపీ ప్రేక్షకులు సినిమా పరిశ్రమను 80శాతం బతికిస్తున్నారు. కానీ, హీరోలతో సహా టాలీవుడ్ లోని ప్రముఖుల ఆదాయం పన్ను తెలంగాణ సర్కార్‌కు జమ అవుతోంది. రాష్ట్రం విభజనతో నష్టపోయిన ఏపీని ఆదాయ పరంగా టాలీవుడ్ మరింత బలహీన పరుస్తోంది. అందుకే, జగన్ సర్కార్ టాలీవుడ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ దెబ్బతో సినీ పరిశ్రమ ఏపీకి తరలివెళ్లడమా? లేక కేసీఆర్ పంచన ఊగులాడడమో తేలనుందా? అంటే హైదరాబాద్ వీడేది లేదంటున్నారు టాలీవుడ్ లోని కొందరు హీరోలు. మరి జగన్ ఏం చేస్తాడో చూద్దాం.