Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు పడనున్నాయా..?
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
- By Gopichand Published Date - 08:49 AM, Tue - 10 September 24

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు (Weather Forecast) జనజీవనం స్తంభించిపోయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వలన ఇప్పటికే సుమారు 79 మంది మృతిచెందినట్లు అధికారులు డేటా విడుదల చేశారు. రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో 46 మంది వరదలు కారణంగా మృతిచెందగా.. తెలంగాణలో 33 మంది మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు ఇరు రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇరు రాష్ట్రాలకు వర్షం ముప్పు తొలగిపోయినట్టేనా..? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో నేడు భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు.
Also Read: Health Benefits: పొద్దు పొద్దున్నే ఈ టీ తాగితే బోలేడు ప్రయోజనాలు..!
ఏపీలో కూడా వర్షాలు
నేడు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు, దక్షణి కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఏపీలో వర్షాల కారణంగా పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఇవాళ స్కూళ్లకు సెలవు ఇచ్చారు. అటు వర్షం ఎఫెక్ట్ ఉన్న ఏలూరు జిల్లాలో పలు పాఠశాలలకు అధికారులు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.