TDP Politics: తిరువూరు టీడీపీలో నలుగురు నేతల మధ్య నలుగుతున్న తెలుగు తమ్ముళ్లు…?
తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉంది. ఆ కంచుకోట గత ఇరవై ఏళ్లుగా బద్దలవుతూ వస్తుంది.
- By Hashtag U Published Date - 11:31 AM, Wed - 17 November 21

తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉంది. ఆ కంచుకోట గత ఇరవై ఏళ్లుగా బద్దలవుతూ వస్తుంది.ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్న తిరువూరులో టీడీపీ నుంచి నల్లగట్ల స్వామిదాస్ 2014 ఎన్నికల వరకు పోటీ చేశారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి నల్లగట్ల స్వామిదాస్ ని బరిలో నిలిపిన వరుసగా ఓటమి చెందారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి కె.ఎస్.జవహార్ తిరువూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాభవాన్ని చవిచూశారు.
తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట, తిరువూరు టౌన్, రూరల్ మండలాల్లో టీడీపీకి బలమైన క్యాడర్, నాయకత్వం ఉంది. 2014 ఎన్నికల్లో మూడు ఎంపీపీలు, మూడు జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ కైవసం చేసుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం అధికార పార్టీ దౌర్జన్యాలకు ఎదురొడ్డి ఇటీవల(2021) జరిగిన పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, నగర పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల గెలుపుకు కృషి చేశారు. అయితే ఆ నాడు పార్టీ కార్యక్రమాలకు మోహం చాటేసిని సీనియర్ నేతలు…ఇప్పుడు అధికార పార్టీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి మళ్లీ తామే పెత్తనం చేయడానికి కొత్త ఇంఛార్జ్ దగ్గరకు చేరుతూ మేము చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ద్వితీయ శ్రేణి నాయకత్వం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీనియర్ నాయకులు పెత్తనం చెలాయించకుండా పార్టీకి,యువ నాయకత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చి పార్టీ గెలుపుకు కృషి చేస్తే తప్ప ఇక్కడ టీడీపీ గెలిచే పరిస్థితి లేదని క్యాడర్ లో వినిపిస్తుంది.
Also Read : టీడీపీతో పొత్తుపై నేతలకు క్లారిటీ ఇచ్చిన అమిత్ షా… ఏం చెప్పారంటే…?
గత ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్ ని రెండేళ్ల తరువాత అధిష్టానం ఎంపిక చేసింది. తిరువూరులోని ఓ కార్పోరేట్ ఆసుపత్రికి చెందిన శావల దేవదత్ ని ఇంఛార్జ్ గా అధిష్టానం నియమించింది. అయితే అసలు సమస్య అంతా ఇంఛార్జ్ వచ్చాకే మొదలైంది. ఇప్పటికే తిరువూరు టీడీపీలో మూడువర్గాలు ఉండగా ఈ ఇంఛార్జ్ రాకతో నాల్గవ వర్గం తయారైంది. కొత్త ఇంఛార్జ్ వచ్చాక ఆయనతో మిగిలిన మూడు వర్గాల నాయకులు కలిసి మెలిసి ఉంటునే ఎక్కడికి అక్కడ వర్గపోరును తెరపైకి తీసుకువస్తున్నారు.
గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన నల్లగట్ల స్వామిదాస్, మాజీ మంత్రి కె.ఎస్.జవహార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పని చేసిన వాసం మునియ్య వర్గాలుగా తిరువూరు టీడీపీలో ఉన్నాయి. తాజాగా వచ్చిన దేవదత్ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాత ఇంఛార్జ్, నాయకులతో ఉండే వారిపై నిఘా పెట్టారని క్యాడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే కొత్త ఏవరు ఏదీ చెప్పిన దానిని వెనకా ముందు ఆలోచించకుండానే సదరు కార్యకర్తలకు ఫోన్ చేసి అడిగేస్తుండటంతో క్యాడర్‌లో పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ టీడీపీ కార్యకర్త పుట్టిన రోజు వేడుకలను టౌన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమయంలో కొత్త ఇంఛార్జ్ దేవదత్ నాయకులపై నోరుపారేసుకన్నారట. ఏదీ జరిగినా ఆయనకు తెలిసే చేయాలని హుకుం జారీ చేశారంట. కార్యక్రమాల విషయంలోనూ కొత్త ఇంఛార్జ్ పై టీడీపీ క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తుంది.100 మంది కలిసి ఏదో ఒక కార్యక్రమం చేసిన కనీసం వారి బాగోగులు కూడా చుడటంలేదని క్యాడర్ వాపోతున్నారు.
Also Read : రక్షణ రంగంలోకి నూతన నౌకలు
మరోవైపు ఇంఛార్జ్‌గా శావల దేవదత్ బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక విన్సస్నపేట జెడ్పీటీసీ ఎన్నిక. ఈ ఎన్నికల్లో తన సత్తా ఎంటో చూపించాల్సింది పోయి ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నాయకులతో చర్చిలు జరిపినట్లు క్యాడర్ ఆరోపిస్తుంది. విన్సన్నపేట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోటీ చేయాల్సిందేనని కార్యకర్తలు పట్టుబట్టినప్పటికి ఇంఛార్జ్ మాత్రం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని వెనక్కి తగ్గారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాయకులంతా చందాలు వేసుకుంటే ప్రచారం చేద్దామని ఉచిత సలహాలు ఇస్తున్నారని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. అభ్యర్థి అనారోగ్యంతో ఉన్నా తాను పోటీ చేయడానికి సిద్దంగానే ఉన్నానని…బాధ్యతలు మాత్రం నాయకులు తీసుకోవాలని ఆయన ఇంఛార్జ్‌కి తెలిపారు.అయితు చివరికి అభ్యర్థి అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ ప్రచారానికి, పోటీకి దూరంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఇదంతా ఇలా ఉంటే ఇంఛార్జ్ పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డవారు కొత్త ఇంఛార్జ్ వ్యవహారశైలిని పదేపదే తన వర్గంతో ఎత్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి కె.ఎస్.జవహార్ కి రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికి ఆయనికి ఇంకా నియోజకవర్గాన్ని కేటాయించలేదు. 2014లో గెలిచిన కొవ్వూరు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా వెళ్తారనే ప్రచారం జరగుతున్న అక్కడి నాయకులు మాత్రం ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో జవహార్ కూడా తన ప్రయత్నాల్లో తాను ఉన్నారట. ఒకవేళ కొవ్వూరు టికెట్ తనకు రాకపోతే ఇటు తిరువూరు నియోజకవర్గంలో చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే అవకాశం వస్తుందేమోనని భావిస్తున్నారు.అందులో భాగంగానే ఆయన కుమారుడు కొత్తపల్లి ఆశీష్ లాల్ ని తిరువూరు నియోజకవర్గానికే పరిమితం చేశారు. నియోజకవర్గంలో ఏ ఫంక్షన్ ఉన్నా..ఏ కార్యక్రమం ఉన్నా ఆశీష్ లాల్ ప్రత్యక్షమవుతున్నారు. అయితే గతంలో జవహార్ సోదరుడు రవీంధ్రనాథ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడం, గత ఎన్నికల్లో జవహార్ పోటీ చేసి ఓడిపోవడంతో ఇక్కడ ఆ కుటుంబానికి పెద్దగా పట్టులేదని తేలిపోయింది. జవహార్ వ్యవహారశైలి,మంత్రిగా చేసినా ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయారని క్యాడర్‌లో ఇప్పటికి చర్చ జరుగుతుంది.
Also Read : తెలంగాణ పల్లెకు అంతర్జాతీయ గుర్తింపు!
మరో ఆశావాహుడు కృష్ణాజిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పని చేసిన వాసం మునియ్య కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు తనదైన శైలిలో ఇంఛార్జ్ కంటే ముందే కార్యక్రమాలకు అంటెండ్ అవుతూ తన బలం నిరుపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ కూడా తన వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు హాజరవుతూ తన వర్గాన్ని చెల్లాచెదురుకాకుండా చూసుకుంటున్నారు. అయితే ఈ మూడు వర్గాల్లో ఉన్న కార్యకర్తలు ఆయా నేతలతో ఉండటాన్ని కొత్త ఇంఛార్జ్ జీర్ణించుకోలేకపోతున్నారని క్యాడర్‌లో టాక్ వినిపిస్తుంది. ఇటు న్యూట్రల్ గా కార్యకర్తలు మాత్రం ఈ వర్గపోరుతో తలలు పట్టుకుంటున్నారు. న్యూట్రల్ గా ఉన్న కార్యకర్తలు సీనియర్ నాయకులతో మాట్లాడిన సన్నిహితంగా ఉన్న ఎవరి వర్గంగా ముద్ర పడిద్దో అని భయపడిపోతున్నారట. నియోజకవర్గానికి ఇంఛార్జ్ గా ఎవరు వచ్చినా తమ పని తాము చూసుకుని వెళ్లిపోతున్నారని 30 ఏళ్లుగా పార్టీలో ఉంటున్న క్యాడర్,నాయకులు తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. మరి ఈ కొత్త ఇంఛార్జ్ తో అయినా తిరువూరు టీడీపీకి మంచి రోజులు వస్తాయనుకుంటే చివిరికి మరో కొత్త వర్గం తయారైందని టీడీపీ క్యాడర్ అయోమయంలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తిరువూరు టీడీపీలో నలుగురు నాయకుల మధ్య తెలుగు తమ్ముళ్లు నలిగిపోతున్నారనేది వాస్తవం.
Related News

TDP : తిరువూరు టీడీపీ సీటుపై కన్నేసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
వైసీపీని వీడి టీడీపీకి మద్దతు ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైయ్యారు. ఇప్పటికే నెల్లూరు