Balakrishna : పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: ఎమ్మెల్యే బాలకృష్ణ
గతంలో పులివెందులలో ఎన్నికలు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావని, ఓటు వేయడమే కాదు, నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడే పరిస్థితి ఉండేదని బాలయ్య గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం ప్రజలు ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
- By Latha Suma Published Date - 04:08 PM, Thu - 14 August 25

Balakrishna: పులివెందులలో ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం ఇప్పుడే దక్కిందని, గతంలో ప్రజాస్వామ్యం పేరు మాత్రమే మిగిలిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పులివెందులలో ఎన్నికలు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావని, ఓటు వేయడమే కాదు, నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడే పరిస్థితి ఉండేదని బాలయ్య గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం ప్రజలు ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
ఇది పులివెందులలో ప్రజల బలమైన సంకల్పానికి నిదర్శనం. ప్రజలు ఇప్పుడు గళాన్ని వినిపించే అవకాశం పొందారు. స్వేచ్ఛగా అభ్యర్థులు నామినేషన్ వేయగలగడం, స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఇదే అని చెప్పాలి అని బాలకృష్ణ అన్నారు. తీవ్రంగా ప్రజలపై భయం మోపిన కాలం ఇప్పుడు వెనకపడిందని, పులివెందుల తన పూర్వవైభవాన్ని తిరిగి పొందుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిజమైన మార్పును కోరుకుంటున్నారని, తమ భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు.
పార్టీ కార్యకర్తల కృషి, ప్రజల నమ్మకమే ఈ విజయానికి కారణమని అభిప్రాయపడ్డ బాలయ్య ఇది ఓ సాధారణ ఉప ఎన్నిక కాదని, ఇది ప్రజల సంకల్పానికి ప్రతీక అన్నారు. పులివెందులలో కలిసికట్టుగా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నిక ఫలితాలు తెలుగుదేశం పార్టీకి మంచి ఊతాన్నివ్వడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ కొత్త మార్గదర్శకాన్ని సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పులివెందులలో జరిగిన ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా మార్పుకు బీజం వేస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీపాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 6,035 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. వైసీపీకి 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్‌కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్ నమోదైంది. ఇకపోతే..ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికలో ముద్దుకృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా, .. వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.