Mahanadu : ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
- Author : Prasad
Date : 28-05-2026 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ మహానాడు-2026 నివాళ్లు అర్పించింది. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటించాలని టీడీపీ మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన మహానాడు రెండో రోజు సభలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రసంగించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులకు నాంది పలికిన మహోన్నత నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ అపూర్వ సేవలు అందించారని చంద్రబాబు గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు ఎన్టీఆర్ కొత్త దిశ చూపించారని అన్నారు. ఎన్టీఆర్ ఖ్యాతి, క్రమశిక్షణ, నాయకత్వం మరెవరికీ సాధ్యం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అలాగే మహిళా సాధికారతపై కూడా చంద్రబాబు ప్రస్తావిస్తూ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. లోకేష్ ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ కార్యక్రమాన్ని అమలు దిశగా తీసుకెళ్తామని తెలిపారు.