CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. ప్రైవేటు వ్యక్తుల చర్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
కాశీబుగ్గ దుర్ఘటన నేపథ్యంలో పండుగలు లేదా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తప్పనిసరిగా పోలీసుల నుండి ముందస్తు అనుమతులు, భద్రతా ప్రణాళికలను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
- By Gopichand Published Date - 03:34 PM, Sat - 1 November 25
CM Chandrababu: శ్రీ సత్యసాయి జిల్లాలోని పెద్దన్నవారిపల్లిలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజావేదికకు హాజరైన ప్రజలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ముందస్తు ప్రణాళిక లేకపోవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై మాట్లాడిన సీఎం తుపాను వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ముందస్తు ప్రణాళిక ద్వారా తాము ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా చూడగలిగామని గుర్తు చేశారు. అలాంటిది ఈ తొక్కిసలాటలో ఇంతమంది మృతి చెందడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఆలయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం చాలా విచారకరం. ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే భక్తులను క్యూలైన్లలో నియంత్రించేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు అవకాశం ఉండేది” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ మళ్లీ ఎలా ఫిట్‌గా అయ్యాడో తెలుసా?
ప్రైవేటు వ్యక్తుల చర్యలపై ఆగ్రహం
ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటే కొందరు ప్రైవేటు వ్యక్తులు సరైన అనుమతులు, ప్రణాళిక లేకుండా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఈ తరహా తొక్కిసలాట దుర్ఘటనలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై సీరియస్‌గా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధ్యులను తక్షణం కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినమైన నిబంధనలు, చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
కాశీబుగ్గ దుర్ఘటన నేపథ్యంలో పండుగలు లేదా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు తప్పనిసరిగా పోలీసుల నుండి ముందస్తు అనుమతులు, భద్రతా ప్రణాళికలను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ ఘటన రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లు, గుంపు నియంత్రణ విషయంలో మరింత అప్రమత్తత అవసరాన్ని నొక్కి చెప్పింది.