YSRCP : త్వరలోనే వైఎస్సార్ సీపీలోకి మరో కీలక కాంగ్రెస్ నేత
వైఎస్సార్ సీపీ(YSRCP)లో చేరడానికి ఆసక్తిగా ఉన్న కాంగ్రెస్ నేతల జాబితాలో ప్రస్తుతానికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. మాజీ ఎంపీ హర్షకుమార్.
- By Pasha Published Date - 07:38 AM, Wed - 26 February 25

YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్‌కు సీనియర్ నేత శైలజానాథ్ గుడ్ బై చెప్పి, వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. స్వయంగా వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి, శైలజానాథ్‌ను తన పార్టీలోకి ఆహ్వానించారు. శైలజానాథ్ బాటలోనే మరింత మంది ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే షర్మిల సారథ్యంలోని రాష్ట్ర కాంగ్రెస్‌కు గడ్డు కాలమే ఎదురవుతుంది.
Also Read :Lord Shiva Favourite Colour: మహాశివరాత్రి నాడు మహిళలు ఏ రంగు గాజులు ధరిస్తే శుభం కలుగుతుంది?
ఆసక్తిగా ఉన్నారనే సందేశం..
వైఎస్సార్ సీపీ(YSRCP)లో చేరడానికి ఆసక్తిగా ఉన్న కాంగ్రెస్ నేతల జాబితాలో ప్రస్తుతానికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. మాజీ ఎంపీ హర్షకుమార్. గత రెండు నెలలుగా ఆయన జగన్‌కు మద్దతుగా, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నాయకత్వాన్ని సమర్ధించేలా హర్షకుమార్ ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. ఈ పరిణామాన్ని బట్టి, వైఎస్సార్ సీపీలో చేరేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నారని స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Also Read :Mahashivratri: మహాశివరాత్రి నాడు శివుడిని పూజించాలంటే ఏ రంగు దుస్తులు ధరించాలి?
ఈ కామెంట్లు..
ఇటీవలే హర్షకుమార్ చేసిన కొన్ని కామెంట్లను చూద్దాం.. ‘‘జగన్‌ను చూసి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు’’, ‘‘జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది ప్రభుత్వం ఇష్టం. అయితే గతంలో ఢిల్లీ అసెంబ్లీలో మూడు సీట్లు వచ్చిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సీట్ల సంఖ్య ప్రాతిపదిక కాదు. ప్రతిపక్ష పార్టీ ముఖ్యం’’ , ‘‘సభలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది’’ ఇవన్నీ హర్ష కుమార్ వ్యాఖ్యలే. జగన్‌కు మద్దతుగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు ? అనే ప్రశ్నకు చాలా రకాల సమాధానాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల.. వైఎస్సార్ సీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు . హర్ష కుమార్ అందుకు భిన్నమైన విధానంతో ముందుకు పోతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సొంత విధానాలు, స్వతంత్ర వైఖరి అనేవి పార్టీలు మారే సమయాల్లోనే నాయకుల్లో కనిపిస్తుంటాయని పరిశీలకులు అంటున్నారు.
ఎమ్మెల్సీ బరిలో హర్షకుమార్ తనయుడు
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుతో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, వామపక్ష పార్టీల మద్దతుతో యుటిఎఫ్ అభ్యర్థిగా డి.వి. రాఘవులు, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జి.వి. సుందర్ మధ్య పోటీ నెలకొంది. రేపు (ఈనెల 27న) ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మూడు లక్షల 15 వేల 267 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.