Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేత.. నిండుకుండలా నాగార్జునసాగర్
శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కారణంగా అధికారులు ఆరు స్పిల్‌వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. వీటి ద్వారా ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు (1,62,942) క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్‌ఫ్లో ప్రస్తుతం రెండు లక్షల నలబై ఎనిమిదివందల తొమ్మిది (2,48,900) క్యూసెక్కులుగా నమోదైంది.
- By Latha Suma Published Date - 12:25 PM, Tue - 29 July 25

Srisailam : ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవడంతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు (2,29,743) క్యూసెక్కుల నీరు వరద ప్రవాహంగా చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటి విడుదల ప్రారంభించారు. శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కారణంగా అధికారులు ఆరు స్పిల్‌వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. వీటి ద్వారా ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు (1,62,942) క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్‌ఫ్లో ప్రస్తుతం రెండు లక్షల నలబై ఎనిమిదివందల తొమ్మిది (2,48,900) క్యూసెక్కులుగా నమోదైంది.
అంతేకాకుండా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఇరవై వేల (20,000) క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను (35,315) క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై వేల ఆరువందల నలభై మూడు (30,643) క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయపు నీటి మట్టం 883 అడుగులకు చేరగా, పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. అలాగే, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 204.78 టీఎంసీలు ఉండగా ఉంది.
18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే సాగర్ నుంచి నీటిని విడుదల
ఎగువ నుంచి శ్రీశైలం ద్వారా విడుదలైన భారీ వరద నాగార్జునసాగర్‌కు చేరడంతో, ఆ జలాశయానూ నిండుకుండలా మార్చింది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 26 క్రెస్ట్ గేట్లలో 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జలాశయం ప్రస్తుతం 586.60 అడుగుల నీటి మట్టానికి చేరగా, పూర్తి సామర్థ్యం 590 అడుగులు (312.04 టీఎంసీలు)గా ఉంది. ప్రాజెక్టు గేట్లను ఎత్తిన నేపథ్యంలో, దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి ప్రవాహం ముమ్మరంగా కొనసాగుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు తక్షణం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది 18 ఏళ్ల తరువాత తొలి సారిగా, నెల ముందుగానే నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. ఇది చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.
నాగార్జునసాగర్ ఆధునిక దేవాలయం..మంత్రి ఉత్తమ్ కుమార్
ఈ సందర్భంగా నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..నాగార్జునసాగర్ మన ఆధునిక దేవాలయం. ఇది 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రాణవాయువు అని ప్రశంసించారు. ఆనకట్ట క్రెస్ట్ గేట్లను ఎత్తడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారని, తరువాత ఇందిరా గాంధీ దీనిని ప్రారంభించారని ఆయన అన్నారు. ఈ మెగా ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటిలోనూ 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని ఆయన గుర్తించారు. ఇది 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే గొప్ప ప్రాజెక్టు.అని పేర్కొన్నారు. ఇటు సాగర్‌లో వరద కొనసాగుతుండగా, మరోవైపు శ్రీశైలం గెట్లనూ అదుపుగా నిర్వహిస్తూ వరద నీటిని సమర్థంగా క్రమపద్ధతిలో విడుదల చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరియు విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని సమాచారం.